కొల్లాపూర్, జూలై 22 : కొల్లాపూర్ వ్యవసాయ డివిజన్ పరిధిలో ఈ వానకాలంలో రైతులు సాగు చేసిన మెట్టపంటలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈమారు కొల్లాపూర్ వ్యవసాయ డివిజన్ పరిధిలో సాగు చేసిన మెట్ట పంటల దిగుబడిపై రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. గతంలో డివిజన్ పరిధిలో బీడు పొలాలకు సాగునీరు లేనప్పడు పూర్తిగా కొల్లాపూర్ ప్రాంత రైతులు మెట్టపంటల పై వర్షాధారాన్ని నమ్ముకొని వ్యవసాయం చేస్తూ వచ్చారు. 2012 యాసంగి సీజన్ నుంచి బీడు పొలాలకు మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ద్వారా కృష్ణానది నీరు పారుతుండడంతో రైతులకు కొండంత బలం చేకూరింది. కాగా కొల్లాపూర్ డివిజన్ పరిధిలోని పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కొల్లాపూర్, కోడేరు మండలాల రైతులు ఈ వానకాలంలో మెట్టలో వివిధ రకాల పంటలను సాగు చేశారు. మొక్కజొన్న, కంది, వేరుశనగ, పత్తి, మినుములు, ఆముదం పంటలను మెట్టలో అన్నదాతలు సాగు చేశారు.
ఈ వానకాలంలో ఇప్పటి వరకు కురిసిన వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయి. రైతులు పెద్దమొత్తంలో ఆశలు పెట్టుకున్న సీజన్ యాసంగి పంటలపైనే. కానీ తిండిగింజల కోసం జొన్న పైరును అక్కడక్కడ రైతులు సాగుచేశారు. మార్కెట్లో మెట్టపంటలకు డిమాండ్ ఉన్నది. వారంలో రోజులుగా వరుసగా వర్షాలు పడడం తో పంట పొలాల్లో కలుపు విపరీతంగా పెరిగింది. రెండు రోజులుగా వర్షాలు ఎడతెరిపి ఇవ్వడంతో రైతు లు ఇదే అదనుగా భా వించిన రైతులు పొలాల్లో కలుపుతీత కోసం గుంటుకలు కొట్టడంతోపాటు కూలీలు కలుపుతీస్తున్నారు. వర్షాలు ఏకధాటిగా కురియడంతో పంట పొలాల్లో ఏపుగా కలుపు పెరిగింది. దీంతో రైతులు పంట పొలాల్లో కూలీలు, గుంటుకలతో కనిపిస్తున్నారు. కొల్లాపూర్ మండలంలో జూన్ మాసంలో సాధారణ వర్షపాతం 83.1మిల్లీ మీట ర్లు ఉండగా 164.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూలై మాసంలో ఈనెల 22వ తేదీ నాటికి సాధారణ వర్షపాతం 141.6మిల్లీమీటర్లు కాగా 139.5 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ గణాంకాధికారి విశ్వేశ్వర్ వెల్లడించారు.
వానకాలంలో సాగు వివరాలు
కొల్లాపూర్ మండలంలో సాగైన జొన్న 3 ఎకరాలు, మొక్కజొన్న 850 ఎకరాలు, కంది 103 ఎకరాలు, పత్తి 80ఎకరాలు, వేరుశనగ 51 ఎకరాలు, ఆముదం 20 ఎకరాలు. పెంట్లవెల్లి మండలంలో మొక్కజొన్న 210 ఎకరాలు, కంది 195 ఎకరాలు, వేరుశనగ 185 ఎకరాలు, కోడేరు మండలంలో మొక్కజొన్న 300 ఎకరాలు, కంది 30 ఎకరాలు, పత్తి 310 ఎకరాలు, మినుములు 18 ఎకరాలు, వేరుశనగ 12 ఎకరాలు, ఆముదం 10 ఎకరాలు రైతులు మెట్టలో సాగు చేశారు. అలాగే పెద్దకొత్తపల్లి మండలంలో జొన్న 12 ఎకరాలు, మొక్కజొన్న 1045 ఎకరాలు, కంది 37 ఎకరాలు, వేరుశనగ 12 ఎకరాలు, పత్తి 1245 ఎకరాలు రైతులు సాగు చేశారు. వారం రోజులుగా వానలు లేకపోవడంతో మెట్ట పంట పైర్లు కళకళలాడుతున్నాయి. రైతులను పైర్లు మురిపిస్తున్నాయి. దీంతో రైతులు ముందస్తుగానే పంట దిగుబడిపై అంచనాలను వేస్తున్నారు.
మెట్ట పంటలు బాగు
వానకాలంలో మెట్టలో సాగు చేసి న పంటలు ఆశాజనకంగా ఉన్నా యి. పంటలు బాగా ఉండడంతో రైతులకు ఎంతో ఇమ్మతినిస్తోంది. వర్షాలు కూడా కొంత వర్పునిచ్చి కురియడంతో మెట్ట పైర్లు కళకళలాడుతున్నాయి. పంట దిగుబడి కూడా ఆశాజనకంగానే ఉంటుందని భావిస్తున్నాం.
– రవి, ఏడీఏ, కొల్లాపూర్