మహబూబ్‌నగర్, జూలై 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జాతీయ రహదారి నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. పలు చోట్ల హైవే లింకు పనులు పూర్తి కానందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పూర్తి చేయాలన్నారు. మహబూబ్‌నగర్‌లోని అప్పన్నపల్లి వద్ద జరుగుతున్న 2వ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు. నాణ్యవంతంగా, త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. బ్రిడ్జి పనులు పూర్తయితే రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. హైవే నిర్మాణం చేపట్టినా పట్టణంలోని చాలా చోట్ల లింకు రోడ్డు పనులు అసంపూర్తిగా వదిలేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. హైవే వెంట ఫుట్‌పాత్‌లపై పాదచారులకు ఇబ్బంది లేకుండా పూలకుండీలు ఏర్పాటు చేసి పచ్చదనం పెంచాలన్నారు. అదేవిధంగా బ్రిడ్జికి సమాంతరంగా నిర్మిస్తున్న సర్వీస్‌రోడ్డు, సీసీడ్రైన్ పనులను పరిశీలించారు. స్థానికులకు ఇబ్బంది లేకుండావిద్యుత్ స్తంభాలు వేయాలన్నారు. అంతకుముందు న్యూటౌన్‌లో జరుగుతున్న ఫుట్‌పాత్ పనులను పరిశీలించారు. ఫుట్‌పాత్ కోసం తీసుకొచ్చిన టైల్స్ నాణ్యతను పరిశీలించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కమిషనర్ ప్రదీప్‌కుమార్, జాతీయ రహదారుల శాఖ అధికారులు ఉన్నారు.
అభివృద్ధికి కంకణబద్ధులమై పనిచేద్దాం
అభివృద్ధికి కేరాఫ్‌గా మహబూబ్‌నగర్‌ను నిలబెట్టేందుకు కంకణబద్ధులమై పనిచేద్దామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం బోయపల్లికి చెందిన ముదిరాజ్ సంఘం జిల్లా సీనియర్ నాయకుడు పిట్ల యాదయ్యతోపాటు పలువురు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. చేరిన వారికి మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించి మాట్లాడారు. గడిచిన 70 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో పర్యాటకాభివృ ద్ధి సంస్థ చైర్మన్ ఉప్పుల శ్రీనివాస్‌గుప్తా, పా ర్టీ నాయకులు దోమ పరమేశ్వర్ పాల్గొన్నారు.