మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూలై 19: ప్రస్తుతం చాలా విలువైన సమయమని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే రోజుకు 18గంటల దాకా చదవాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ప్రభు త్వం వేల సంఖ్యలో ఉద్యోగ ప్రకటన చేయడంతో తమ తల్లిదండ్రుల స్మారకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే గ్రూప్స్, పోలీసు ఉద్యోగార్థులకు ఉచితంగా కోచింగ్ అందించామని మంత్రి తెలిపారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శాంతా నారాయణగౌడ్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఉద్యోగార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉంటే విజయం వారిదేనన్నారు. ఫోన్ వినియోగించినా కేవలం సందేహాల నివృత్తి కోసమే ఉండాలని సూచించారు. పేదరికంలో పుట్టడం తప్పు కాదని, పేదలుగానే మిగిలిపోవడం మాత్రం తప్పన్నారు. కడుపుకట్టుకుని పెంచిన తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు రానివారు నిరుత్సాహ పడొద్దని ప్రైవేట్ రంగంలోనూ అత్యుత్తమ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
ఇటీవల జాబ్‌మేళా ద్వారా 3500 మందికి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు అందించామన్నారు. జాబ్‌మేళాలో నెలకు రూ.18 వేల నుంచి రూ.80వేల వరకు వేతనం పొందిన వాళ్లు కూడా ఉన్నారని గుర్తుచేశారు. దివిటిపల్లి వద్ద ఐటీ పార్కు పనులు పూర్తయిన వెంటనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి వివిధ అంశాల్లో నైపుణ్యాలను పెంచి స్థానికంగానే మంచి ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా కల్పించారు. ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హైదరాబాద్ స్థాయిలో నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చారని, మంత్రి చేస్తున్న కృషి ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీహిత మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించేందుకు నిరుద్యోగులకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. శాంతా నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించడం ఎంతో సంతోషంగా ఉందని, గ్రూప్స్ కోసం కూడా సన్నద్ధం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, డీఎస్పీ మహేశ్ పాల్గొన్నారు.
పోచమ్మకు పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలతో ఉత్సాహంగా జరుపుకొనే బోనాల పండుగను మహబూబ్‌నగర్ పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రవీంద్రనగర్, న్యూగంజ్, కొత్త బ్రిడ్జి ఆటోస్టాండ్, వడ్డెర బస్తీ, బండమీదిపల్లి, పాతపాలమూరు, ప్రేమ్‌నగర్, గణేశ్నగర్తోపాటు పలు ప్రాంతాల్లో బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. వేడుకల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనగర్‌లోని పోచమ్మ తల్లికి రాంమందిర్‌చౌరస్తా నుంచి పట్టువస్ర్తాలను తీసుకొని అమ్మవారికి సమర్పించి చల్లంగా చూడమ్మా పోచమ్మతల్లీ అంటూ మొక్కులు చెల్లించారు. అనంతరం తీర్ధప్రసాదాలను స్వీకరించారు. అదేవిధంగా ప్రత్యేక గది నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకటన్న ముదిరాజ్, కౌన్సిలర్ వేదవ్రత్, ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ రాములు, ఆయా వార్డుల ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.