చిన్నంబావి, జూలై 19: మెరుగైన విద్య, వైద్యం అందించడమే తెలంగాణ ప్రభుత్వలక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. చిన్నంబావిలో నూతనంగా రూ.3.8కోట్లతో నిర్మించిన కేజీబీవీ పాఠశాల, గూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడంతోపాటు వెల్టూరు గ్రామంలో రూ.1.74 కోట్లతో 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి మంత్రి మంగళవారం భూమిపూజ నిర్వహించారు. అదేవిధంగా గూడెంలోని కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేజీబీవీ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 29వేల ప్రభుత్వ పాఠశాలలను ‘మన ఊరి- మన బడి’ పథకం ద్వారా అభివృద్ధి చేసుకుంటున్నట్లు తెలిపారు. దేశప్రగతికి పట్టుగొమ్మలైన చిన్నపాటి గ్రామాలను అభివృద్ధి చేయడానికే ప్రకృతి వనాలు, వైకుంఠధామం, డంపింగ్ యార్డు వంటి మౌలిక వసతుల కల్పనతో కేసీఆర్ పాలనలో గ్రామ స్వరాజ్యం వెల్లివిరుస్తుందన్నారు. రైతుల సంక్షేమానికి నిరంతరం విద్యుత్‌ను సరఫరా చేసేందుకు సబ్స్టేషన్లను ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్కిషన్ నాయక్, ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ వెంకట్రామమ్మ, సింగిల్‌విండో చైర్మన్ నరసింహారెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మద్దిలేటి నాయుడు, ఉమ్మడి వీపనగండ్ల మండలం వ్యవహారాల ఇన్చార్జి గోవిందు శ్రీధర్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు పల్లె మద్దిలేటి, సర్పంచులు చక్రవర్తి, చక్రాధర్ గౌడ్, నంది కౌసల్య, రామస్వామి, రంజిత్, ఎంపీటీసీలు భాస్కర్‌రెడ్డి, లక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు చిన్నారెడ్డి, వెంకట్రామ్రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రామన్‌గౌడ్, నరసింహ, కిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
గొల్ల, కురుమలకు సర్కార్ చేయూత
గొల్ల, కురుమలకు రాష్ట్ర సర్కార్ ఆర్థిక చేయూతనందించి వారి బలోపేతానికి కృషి చేస్తున్నదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో మంగళవారం పశువైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత నీలినాలుక వ్యాధి టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం తరువాత గొర్రెల పెంపకానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు. త్వరలో రెండో విడుత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం సన్నద్ధమౌతుందని తెలిపారు. అర్హులైన వారందరికీ గొర్రెలు పంపిణీ చేసేందుకు కృషి చేస్తామన్నారు. సబ్సిడీపై అందజేసిన లబ్ధిదారులకు ఆర్థికభారం పడకుండా గొర్రెలకు ఏడాదికి నాలుగు సార్లు ఉచితంగా నట్టల నివారణ మందులను పంపిణీ చేస్తున్నామన్నారు. ఒక్క పెబ్బేరులోనే 6వేల సబ్సిడీ గొర్రెలకు దాదాపుగా రూ.2.5కోట్ల నిధులను సర్కార్ ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో నాలుగు లక్షల గొర్రెలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం మందులు పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గొర్రెల కాపరుల సంఘం చైర్మన్ కురుమూర్తియాదవ్, వైస్‌చైర్మన్ చంద్రయ్యయాదవ్, డైరెక్టర్లు రాజశేఖర్ యాదవ్, కొల్లంపల్లి యాదవ్, నరసింహ, నాగేంద్రం యాదవ్, బాగన్న యాదవ్, మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్స్ కరుణశ్రీ, శ్యామల, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ బుచ్చారెడ్డి, విశ్వరూపం, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు ముస్తాక్, కౌన్సిలర్ రామకృష్ణ, భారతి, మల్లేశ్ యాదవ్ పాల్గొన్నారు.