నారాయణపేటటౌన్, జూలై 19: కుల వివక్ష, అంటరానితనం వంటి దురాచారాలను రూపుమాపేందుకు విజిలెన్స్ ఆండ్ మానిటరింగ్ అధికారులు కృషిచేయాలని కలెక్టర్ హరిచందన ఆదేశించారు. పట్టణంలోని కలెక్టరేట్ ఈడీ ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే విజిలెన్స్ ఆండ్ మానిటరింగ్ సమావేశం కరోనా కారణంగా గత రెండేండ్లు ఏర్పాటు చేయలేకపోయామని చెప్పారు. కుల వివక్ష, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు, వేధింపులు, భౌతికదాడులు వంటి రుగ్మతలను అరికట్టి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. ప్రతి నెలా గ్రామాల్లో పోలీస్, రెవెన్యూ ఇతర శాఖల సమన్వయంతో సివిల్ రైట్స్‌డే నిర్వహించాలన్నారు. జోగిని దురాచారాలు ఎక్కడైనా జాతరలో జరిగే ప్రమాదం ఉన్నందు వల్ల స్త్రీశిశు సంక్షేమశాఖ, పోలీస్‌శాఖ సమన్వయంతో పసిగట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆయా అంశాలపై గ్రామస్థాయిలో ఇప్పటికే పోలీస్‌శాఖ కళాబృందాలు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు, దాడులు జరిగితే వెంటనే ఎస్సీ, ఎస్టీ కేసులు నమో దు చేసి బాధితులకు రావాలని పరిహారం, న్యాయం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎఫ్ఐఆర్ అనంతరం పరిహారం ఇప్పించడంతో పాటు త్వరగా చార్జిషీట్ వేసి బాధితులకు పూర్తి పరిహారం, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, సాంఫికసంక్షేమ అభివృద్ధి అధికారి కన్యాకుమారి, డీఎస్పీ సత్యనారాయణ, డీఆర్డీఏ పీడీ గోపాల్‌నాయక్, సంఘం నాయకులు శ్రీనివాసులు, ఆశప్ప, దినేష్‌వర్మ పాల్గొన్నారు.