మహబూబ్‌నగర్, జూలై 18 : వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వర్షం ముప్పు ఇంకా తొలగలేదని, మరో రెం డు, మూడు రోజులపాటు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాలకు దెబ్బతిన్న ఇండ్ల వివరాలను సేకరించాలని ఆదేశించారు.
వర్షాలకు కూలిపోయిన ఇండ్ల ఫొటోలు తీసి గూ గుల్ ప్రొఫార్మాలో అప్లోడ్ చేయాలని తాసిల్దార్‌కు సూచించారు. కూలిన ఇండ్లపై ఎప్పటికప్పుడు నివేదిక పంపించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. అలాగే పాఠశాలల్లో మూడురోజులపాటు ప్రత్యేకంగా పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. రెండురోజుల్లో పాఠశాలలన్నీ శుభ్రంగా ఉండాలన్నారు. వైద్యారోగ్య శాఖ, ఆర్బీఎస్కే బృందాలు ప్రతి పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను పరీక్షించాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 1474 చెరువులు ఉండగా, ఇప్పటివరకు 41 చెరువులు అలుగు పారుతున్నాయని తెలిపారు.
ఎక్కడ ఎలాంటి నష్టం వాటిల్లినా వెంటనే స్పందించి సమాచారం అందించాలని పేర్కొన్నారు. వారంరోజులపాటు కురిసిన భారీ వర్షాలతోపాటు ఈదురుగాలులతో అక్కడక్కడ విద్యుత్ సమస్యలు ఏర్పడ్డాయని, ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఉంటే విద్యుత్ శాఖ తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించారు. కలెక్టరేట్‌తోపాటు మున్సిపల్, పోలీస్ శాఖ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూంలను కొనసాగించనున్నట్లు తెలిపారు. మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా 49 పాఠశాలలకు సంబంధించిన ఫొటోలను వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
హరితహారం కార్యక్రమానికి సంబంధించి ఆయా శాఖల ఆధ్వర్యంలో ఇప్పటివరకు నాటిన మొక్కల వివరాలను సమర్పించాలని తెలిపారు. ధరణికి సంబంధించి తాసిల్దార్ల పరిధిలో 339 సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, ఆర్డీవో అనిల్‌కుమార్, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, జెడ్పీ సీఈవో జ్యోతి, డీఆర్డీవో యాదయ్య అధికారులు ఉన్నారు.