పేదల సొంతింటి కలను నిజం చేస్తూ..ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ప్రతిష్టాత్మకంగా సర్కార్ డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నది. జడ్చర్ల మున్సిపాలిటీలోని కావేరమ్మపేటలో నిర్మించిన 120రెండు పడకల గదుల ఇండ్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, అర్హులైన నిరుపేదలకే ప్రాధాన్యతనిస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రకటించ డంతో పేదలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.
– జడ్చర్ల, జూలై 18
జడ్చర్ల, జూలై 18 : సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నది. జడ్చర్ల మున్సిపాలిటీలోని కావేరమ్మపేటలో 120 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. సొంతిల్లు లేని వారి కోసం రెండు బెడ్రూంలు, కిచెన్, హాల్, బాత్ రూం కలిగిన ఇండ్లను నిర్మించి అర్హులకు పంపిణీ చేస్తున్నది. గత ప్రభుత్వాల హయాంలో ఇంటి నిర్మాణాలకు చాలీచాలని డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. దీంతో చాలా మంది ఇండ్లు నిర్మించుకోలేకపోయారు. ఇండ్లు నిర్మించుకున్న వారు అప్పులపాలయ్యారు.
ఇదంతా గమనించిన సీఎం కేసీఆర్ పేదల చేతి నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వకుండా ప్రభుత్వమే స్వయంగా ఇండ్లు నిర్మించి ఇస్తున్నది. ఒక్కో ఇంటికీ రూ.5 లక్షలకుపైగా వెచ్చిస్తున్నది. జడ్చర్ల మున్సిపాలిటీలోని కావేరమ్మపేటలో 15 బ్లాకుల్లో 120 ఇండ్లు నిర్మించి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఒక్కోబ్లాకులో 8 ఇండ్లు ఉన్నాయి. వాటిని మరికొద్ది రోజుల్లో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కృషి చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే రెవెన్యూ అధికారులు లిస్ట్ తయారు చేశారు.
వాటి ఆధారంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్వయంగా కావేరమ్మపేటలో నివసిస్తున్న వారి ఇండ్ల వ ద్దకు వెళ్లి నిజమైన లబ్ధిదారులను గుర్తించనున్నారు. ఈ ప్రకియను కొద్ది రో జుల్లో పూర్తి చేయనున్నారు. అదేవిధంగా జడ్చర్ల మున్సిపాలిటీలోని జడ్చర్ల, ఎర్రగుట్ట, హరిజనవాడ, బోయిలకుంట రోడ్డులో దాదాపు 900 ఇండ్లు పూర్తి కావచ్చాయి. వాటిని కూడా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.