అయిజ/రాజోళి/అమరచింత/శ్రీశైలం;కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతున్నది. తుంగభద్ర డ్యాం నుంచి ఆదివారం 31గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో జూరాల, ఆర్డీఎస్కు జలకళ చేకూరింది. జూరాల నుంచి 23గేట్లు, సుంకేసుల నుంచి 27గేట్ల ద్వారా శ్రీశైలానికి వరద జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. శ్రీశైలం డ్యాంకు 3లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో చేరుతున్నట్లు అధికారులు వెల్లడించారు. టీఎస్ పవర్‌హౌస్‌లో విద్యుదుత్పత్తిని ప్రారంభించి నీటిని దిగువకు విడుదల చేశారు.
అయిజ, జూలై 17: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద తాకిడి పెరుగుతున్నది. ఆదివారం 31గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలోకి 1,65,590 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 1,54,604 క్యూసెక్కులుగా ఉన్నది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 96.534 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 1633 అడుగుల గరిష్ఠ నీటి మట్టానికిగానూ, ప్రస్తుతం 1630.65 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
ఆర్డీఎస్ ఆనకట్టకు వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువన ఉన్న టీబీ డ్యాం నుంచి 31గేట్లు గేట్లు ఎత్తి వరద నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు జలకళ సంతరించుకున్నది. ఆదివారం ఆర్డీఎస్ ఆనకట్టకు 1,54,604 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 1,53,100 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 504 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 14 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
సుంకేసుల నుంచి కొనసాగుతున్న వరద
రాజోళి, జూలై 17: తెలంగాణ సరిహద్దులోని సుంకేసుల డ్యాం నుంచి నాలుగు రోజులుగా వరద కొనసాగుతూనే ఉన్నది. జేఈ రాజు వివరాల ప్రకారం.. కర్ణాటకలోని టీబీ డ్యాం నుంచి 1,60,943 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు తెలిపారు. డ్యాంలో 0.418టీఎంసీల నీటి నిలువను ఉంచుతూ 27 గేట్ల ద్వారా 1,59,888 క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తూ కేసీ కెనాల్‌కు 1,058 క్యూసెక్కుల నీటిని వదులుతున్న అధికారులు తెలిపారు.
జూరాల 23గేట్ల ద్వారా..
అమరచింత, జూలై 17 : ఎగువన కురుసున్న వర్షాలతోపాటు ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద భారీగా వస్తున్నది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టుకు 1.70 లక్షల క్యూసెక్కులు వస్తున్నది. దీంతో 23 గేట్లను ఎత్తి దిగువకు లక్షా56వేల 963 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇదిలా ఉండగా ప్రాజెక్టు వద్ద పర్యాటకుల తాకిడి పెరిగింది.
శ్రీశైలం ప్రాజెక్టుకు..
శ్రీశైలం, జూలై 17: శ్రీశైలం జలాశయానికి ఆదివారం సాయంత్రం జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల నుంచి 1,17,323, విద్యుదుత్పత్తి నుంచి 35,989, సుంకేసుల నుంచి 1,52,585 (మొత్తం 3,05,897 క్యూసెక్కులు) విడుదలయ్యాయి. కాగా, శ్రీశైలం జలాశయంలోకి 3,06,275 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 853.70 అడుగులు ఉండగా, పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 88.4734 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నది. టీఎస్ పవర్‌హౌస్‌లో విద్యుదుత్పత్తిని ప్రారంభించి 25,427క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.