మహబూబ్‌నగర్, జూలై 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎగువ నుంచి కృష్ణానదికి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తం చేయాలని ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. అన్ని రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోయాలని, పవర్ జనరేషన్ చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. నారాయణపూర్ నుంచి జూరాలకు బుధవారం రాత్రి 1,33,188 క్యూసెక్కులు వదిలినట్లు సమాచారం అందిందని.. దీంతోపాటు జూరాలకు వర్షపునీరు చేరుతుండడంతో ఇన్‌ఫ్లో భారీగా వచ్చే అవకాశం ఉందన్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట కలెక్టర్లు వెంకట్రావు, హరిచందన, పోలీసులతో మాట్లాడి అప్రమత్తం చేసినట్లు మంత్రి వివరించారు. పరిస్థితిపై సమీక్షిస్తున్నట్లు తెలిపారు. మక్తల్ నియోజకవర్గంలోని నదీ తీర వాసులకు వరద సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. జూరాల నుంచి అన్ని రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోయడంతోపాటు విద్యుదుత్పత్తిని కూడా చేపట్టాలని జెన్కో అధికారులకు సూచించారు.