మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూలై 12: మహబూబ్‌నగర్ జిల్లాను వైద్య రంగంలో హైదరాబాద్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ పాత కలెక్టరేట్ స్థానంలో రూ.400కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించనున్నామన్నారు. మంగళవారం ప్రభుత్వ ప్రధాన దవాఖానలో నిర్వహించిన దవాఖాన అభివృద్ధి సంస్థ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడారు.
త్వరలోనే సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణాన్ని చేపట్టనున్నామని టెండర్లు కూడా పూర్తయ్యాయన్నారు. సంవత్సరంలో భవనాన్ని పూర్తిచేస్తావని అధునాతన రీతిలో దవాఖానను తీర్చిదిద్ది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. బస్టాండ్ నుంచి దవాఖానకు వచ్చే వారికి ఫుట్ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాకు పారామెడికల్ కళాశాల కూడా తీసుకొస్తామన్నారు.
దవాఖానలో రోగులకు పెట్టే భోజనం నాణ్యతగా ఉండాలన్నారు. దవాఖానలోని ఓపీని వెనుకవైపునకు మార్చాలని, అదేవిధంగా ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్‌కు రూ.50 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. హోమియో దవాఖానను ప్రస్తుతమున్న పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని అక్కడే పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పీహెచ్సీ, హోమియో, ఆయుర్వేద, యునాని అన్నింటికి సంబంధించి తక్షణమే తనకు నివేదికలను అందజేయాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్‌ను ఆదేశించారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిములు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, దవాఖాన అభివృద్ధి సంస్థ కమిటీ సభ్యులు లక్ష్మి, మల్లేశ్, సత్యం యాదవ్,ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్, టీఎస్హెచ్ఐడీసీఈఈ జైపాల్ రెడ్డి, రెడ్‌క్రాస్ అధ్యక్షుడు లయన్ నటరాజ్, ఆర్ఎంవో సిరాజుద్దీన్, సీనియర్ ప్రొఫెసర్లు దవాఖాన అభివృద్ధి సంస్థ సభ్యులు హనుమంతు, ప్రసాద్, గైనిక్ హెచ్‌వోడీ రాధ, డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణ, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నవకళ్యాణి, డాక్టర్ జీవన్, డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు