మహబూబ్‌నగర్ రూరల్/టౌన్, జూలై 12: ముదిరాజ్‌లకు అనేక పదవుల్లో ప్రాధాన్యం కల్పించి వారి సంక్షేమానికి కృషి చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. టీడీగుట్ట ముదిరాజ్ సంఘం, టీఆర్ఎస్ నాయకుడు దోమ పరమేశ్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట వద్ద మంత్రి సమక్షంలో సుమారు 300 మంది సంఘం సభ్యులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాబిన్ హుడ్‌గా ఖ్యాతి గడించిన పండుగ సాయన్న మనుమండ్లకు డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వడమే కాకుండా ఆయన సమాధిని కాపాడిన వారందరికీ ఇండ్లు ఇస్తామన్నారు. పేదల కోసం తన జీవితాంతం పోరాడిన పండుగ సాయన్న పోరాటం మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. మత్స్య కారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే మత్స్యకారుల సంక్షేమానికి రూ.140కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ముదిరాజ్ భవన నిర్మాణానికి 500గజాల స్థలం, రూ.10లక్షల నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
శకలాలు తొలగించాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో పరిధిలోని కోస్గి రోడ్డు నుంచి నీళ్ల నాయక్‌తండా మార్గంలో గోదాం ప్రహరీ కూలడంతో రోడ్లపై గోడ శకలాలు పడి రాకపోకలకు అంతరాయం కలుగుతున్నదని తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జోరు వర్షంలోనూ అక్కడి వెళ్లి పరిశీలించారు. వెంటనే శకలాలు తొలగించాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఆంజనేయస్వామి గుడి నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. వెంటనే గుడి నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్నమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్టలో రూ.10లక్షలతో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. స్థానిక మహిళల విజ్ఞప్తి మేరకు కమ్యూనిటీ హాల్లో మౌలిక వసతుల కల్పించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. కుట్టుశిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్లు కిశోర్, గోవిందు, చిన్న, మున్ని, మోసిన్, శ్రీనివాస్ రెడ్డి, ఖాజాపాషా పాల్గొన్నారు.
కూలిన ఇండ్ల
వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి డా.వీ.శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని చిన్నదర్పల్లిలో కూలిన ఇండ్లను మంత్రి పరిశీలించారు. నారాయణ అనే వృద్ధుడికి చెందిన గోడ కూలిన పెంకుటిల్లును చూసి వెంటనే ఇల్లు ఖాళీ చేయించి పునరావాస కేంద్రానికి తరలించాలని అధికారులకు సూచించారు. కూలిపోయిన ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా రూ.3లక్షలు కేటాయిస్తామని నారాయణకు మంత్రి భరోసానిచ్చారు. వర్షం వల్ల పూర్తిగా, పాక్షికంగా కూలిన ఇండ్ల నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.