మహబూబ్‌నగర్, జూలై 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకుతోడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు జలకళ వచ్చేసింది. దీంతో ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. శ్రీశైలానికి 42వేల 152 క్యుసెక్కుల నీటిని వదులుతున్నారు. కర్ణాటక నుంచి భారీ స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉన్నందునా జూరాల గేట్లు బుధవారం ఎత్తివేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దీంతో అధికారులు నదీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నందున కృష్ణ ఎగువ ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. దీంతో ఆల్మట్టినుంచి లక్ష క్యూసెక్కుల వరద నారాయాణపూర్ డ్యాంకు వస్తుంది. దీంతో కర్ణాటక అధికారులు లక్షా నాలుగు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాం 14గేట్లు ఎత్తివేయడంతో వరద బుధవారం జూరాలకు చేరుకునే అవకాశం ఉంది. గంటగంటకు ఇన్‌ఫ్లో పెరుగుతుండటంతో మంగళవారం తెల్లవారుజామున ఆరు యూనిట్లలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.
తుంగభద్ర పరవళ్లు: 20 గేట్లు ఎత్తివేత
అయిజ, జూలై 12: తుంగభద్ర తెలంగాణ రాష్ట్రంలోకి వడివడిగా పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు టీబీ డ్యాంకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో మంగళవారం కర్ణాటకలోని హోస్పేట్లోని తుంగభద్ర డ్యాం 20 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు 45,018 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో తుంగభద్ర పరవళ్లు తొక్కుతూ ఆర్డీఎస్, సుంకేసుల, శ్రీశైలం వైపు అడుగులు వేస్తోంది. టీబీ డ్యాం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకల ద్వారా తుంగభద్ర జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది.
టీబీ డ్యాంలోకి ఇన్‌ఫ్లో 92,175క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 49,423 క్యూసెక్కులు ఉంది. 105.788 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 98.650 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 1633 అడుగుల నీటిమట్టానికిగానూ, 1631.20 అడుగులు ఉన్నట్లు టీబీ డ్యాం ఎస్ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు టీబీ బోర్డు సెక్రటరీ నాగమోహన్, 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. రాత్రి 9గంటల తరువాత 10గేట్లు అడుగు మేర, మరో 10 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు నేటి రాత్రి వరద నీరు చేరుకుంటుందని ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు.