మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 12 : ఈ సంవత్సరం జిల్లాలో అమలు చేయనున్న మత్స్య, పశు సంవర్ధక శాఖల కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. ప్రభుత్వం తరఫున మత్స్యశాఖ ద్వారా ఆయా చెరువుల్లో చేప పిల్లలను వదిలే ముందే గుర్తించిన చెరువులను నిర్ధారించాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్లలో మత్స్య, ఇరిగేషన్, పశు సంవర్ధక, ఎస్సీ అభివృద్ధి శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సంవత్సరం చేప పిల్లలు వదిలే చెరువులను ఇరిగేషన్, మత్స్య శాఖ అధికారులు కలిసి గుర్తించాలన్నారు. కాగా జిల్లాలో 1400 చెరువులు ఉండగా వాటిలో 1265 వరకు చేపపిల్లలు వదిలేందుకు వీలుగా ఉన్నాయని మత్స్య శాఖ ఏడీ రాధారోహిణి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దళితబంధు కింద జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు డెయిరీ యూనిట్లకు చేయుతనిస్తున్నామన్నారు. ఇందులో భాగం గా మొత్తం 43 డెయిరీ యూనిట్లకు చెందిన లబ్ధిదారులు ఈనెల 9న గుజరాత్లోని మేహసాన్కు వెళ్లడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మధుసూదన్, జిల్లా మత్స్యశాఖ అధికారి రాధా రోహి ణి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదయ్యగౌడ్, ఇరిగేషన్ఈఈలు దాయానంద్, రమేశ్ పాల్గొన్నారు.