మహబూబ్‌నగర్, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొలువుల జాతర మొదలైంది. గ్రూ ప్-1, పోలీసు, ఇతర శాఖల్లో కొలువు లు కొట్టేందుకు నిరుద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. అందుబాటులో ఉన్న పుస్తకాలు చదువుతున్నారు. ఆన్లైన్లో అవసరమైన వెబ్సైట్లను జల్లెడ పడుతున్నారు. ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమం లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్త ఆ ధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు పరీక్షల్లో ఎలా గట్టెక్కాలి.. మెమోరీ పవర్‌ను ఎలా పెంచుకోవాలన్న విషయాలపై మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎక్స్పో ప్లాజాలో అవగాహన కల్పించనున్నారు. సదస్సుకు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తమ వంతు సహకారం అందిస్తున్నారు. నిపుణులతో అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయనున్నారు.
నిపుణులతో అవగాహన..
ఉద్యోగాలు సాధించాలనే తపన ఉన్న అభ్యర్థుల్లో భయం పోగొట్టడంతోపాటు స్కిల్స్‌ను ఉపయోగించి విజేతగా నిలవాలంటే ఏం చేయాలి..? ఎలా ప్రిపేర్ కావాలి..? అనే అనుమానాలను నివృత్తి చేసేందుకు ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ నడుం బిగించింది. నిపుణులతో అవగాహన కల్పించనున్నారు. హైదరాబాద్‌లోని సీఎస్బీ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత స్టడీస్కిల్స్పై అవగాహన కల్పించనున్నారు. హైదరాబాద్ వేపా అకాడ మీ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేపా అభ్యర్థుల్లో భయాలను పోగొట్టి మెంటల్ ఎబిలిటీని ఎలా పెంచుకోవాలనే దానిపై వివరించనున్నారు. మంగళవారం మ హబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న ఎక్స్పో ప్లాజాలో ఏర్పా టు చేసిన కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించనున్నారు. కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు ముఖ్య అథితులుగా హాజరుకానున్నారు. నిరుద్యోగులు పెద్దఎత్తున హాజరుకావాలని నిర్వాహకులు కోరుతున్నారు.
శాంతానారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం శాంతానారాయణగౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించారు. అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వనించా రు. వందలాది మంది అభ్యర్థులకు అన్ని వసతులతో కూడిన ఉచిత కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులైన వారితో కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఉచితంగా మెటీరియల్, నోట్బుక్కు లు, పెన్నులు, భోజన వసతికూడా కల్పించారు. డిజిటల్ స్క్రీన్‌తో బోధన ఇస్తున్నారు. అలా గే, బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ఆయా స్టడీసర్కిళ్ల ద్వారా అధికారులు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వ భవనాలను కేటాయించారు. కోచింగ్ అనంత రం స్టడీ హవర్స్‌లో చదువుకునేందుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించా రు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో అభ్యర్థులు చదువుకునేందుకు ప్రత్యేక మెటీరియల్‌ను సిద్ధంగా ఉంచారు. వీళ్లందరి కీ అక్షయ పాత్రతో ఉచితంగా మధ్యాహ్న భోజనం, తా గునీరు, మజ్జిగను అందిస్తున్నారు. కొన్నిచోట్ల రూ.5కే నాణ్యమైన భోజనం అందిస్తున్నా రు. ఇక ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో కూడా ప్రిపేర్ అవుతున్నారు.
ఉద్యోగాలు సాధించాలి..
శాంతానారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. గతేడాది నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ దవాఖానలో రోగుల తరఫు బంధువులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించాం. అలాగే కరోనా సమయంలో క్వారంటైన్లో ఉన్న వారికి ఇంటి వద్దే భోజనం అందించాం. చాలా మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు సైతం అందించాం. ఇప్పుడు ప్రభుత్వం భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయడంతో నిరుద్యోగులకు చక్కని కోచింగ్ అందించాం. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కోచింగ్ సెంటర్ అయిన విన్నర్ పబ్లికేషన్స్ ఫ్యాకల్టీ ద్వారా కోచింగ్ ఇప్పించాం. గ్రూప్-2, గ్రూప్-3 కోసం వెయ్యి మందికి, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం మరో వెయ్యి మందికి మెటీరియల్ అందించాం. అలాగే నిత్యం ఉచితంగా మధ్యాహ్న భోజన సదుపాయం అందించాం. ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్న వాళ్లందరికీ బెస్ట్ ఆఫ్ లక్.
– వి.శ్రీహిత, చైర్పర్సన్, శాంతానారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్, మహబూబ్‌నగర్
కొలువుల జాతర..
నిరుద్యోగులకు ఇచ్చిన హమీ మేరకు సీఎం కేసీఆర్ 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. గ్రూప్-1, పోలీస్, వైద్య, ఆరోగ్య శాఖలతో పాటు అన్ని శాఖల్లో భారీ ఎత్తున నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చాలా మంది దాతలు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు ముం దుకొచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ముఖ్యమైన కేంద్రాల్లో ఉచితంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చే శారు. భోజనం, వసతి ఏర్పాట్లు కూడా చేశారు. వేలాది మంది నిరుద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతోపా టు 80,039 కొత్త పోస్టులను భర్తీ చేయనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి ఐదు జిల్లాల్లో ఆయా జిల్లా పోస్టులన్నీ కలిపి 4,429 జిల్లా స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. జోగుళాంబ జోన్ స్థాయిలో 2,190 ఉద్యోగాలకు ఉమ్మడి జిల్లా నిరుద్యోగులు పోటీ పడనున్నారు. మరోవైపు మల్టీ జోన్-2 (జోగుళాంబ, యాదాద్రి, చార్మినార్) పరిధిలో 6,370 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.