వనపర్తి, జూలై 11 (నమస్తే తెలంగాణ) : సా గు, తాగునీటికి కటకటలాడి పొలాలను బీళ్లుగా పెట్టిన రోజుల నుంచి.. నేడు పుష్కలంగా సాగునీరందుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎ క్కడ చూసినా నీటి వనరులే దర్శనమిస్తున్నాయి. దీంతో నాడు వలసలు వెళ్లిన వారు నేడు స్వగ్రామాల్లో సంబురంగా సాగు చేసుకుంటున్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ తీసుకున్న సాగునీటి సంస్కరణలు, చేపట్టిన చర్యలు, అమలు చేసిన పథకాలే కారణం. సాగునీరే కనిపించని వనపర్తి జిల్లాలో నేడు జలవనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. ఇదిలా ఉండగా, మిషన్ కాకతీయ పథకంలో చెరువులు, కుంటలు మరమ్మతులు చేసుకోవడంతో నీటి నిల్వ పెరిగింది. భూగర్భజలాలు ఉబికి వస్తున్నాయి. బోర్లు, బావుల్లో నీరు పుష్కలంగా ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే మిషన్ కాకతీయ రైతుల బతుకుమార్చింది. ఆయకట్టు పెరిగింది. ఇంకో విశేషమేమిటంటే.. మిషన్ కాకతీయలో భాగంగా ఖిల్లాఘణపురం మండలంలోని గణప సముద్రాన్ని బలోపేతం చేయడంతోపాటు పూడిక తీత పనులు చేశారు. కృష్ణానది బ్యాక్‌వాటర్‌ను కాలువల ద్వారా గణపసముద్రం చెరువుకు తరలించారు. దీంతో 40 ఏండ్ల తరువాత ఇటీవల గణపసముద్రం అలుగుపారింది. ఇలా అనేక చెరువులు జలకళను సంతరించుకున్నాయి.
సాగునీటి కొరత లేదు..
మిషన్ కాకతీయలో భాగంగా గణప సముద్రానికి మరమ్మతులు చేశారు. అప్పటి నుంచి సాగునీటికి ఇబ్బందులు లేవు. పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. వలసలు తగ్గాయి. ఇప్పుడు కర్నెతండా లిఫ్ట్ కూడా మంజూరైంది. తిండికి లేని ప్రాంతంలో నేడు ధాన్యపు సిరులతో కళకళలాడుతున్నది. సీఎం కేసీఆర్‌కు, మంత్రి నిరంజన్‌రెడ్డికి రుణపడి ఉంటాం.
-కృష్ణానాయక్, ఎంపీపీ, ఖిల్లాఘణపురం