మహబూబ్‌నగర్ టౌన్, జూలై 11: జిల్లాలో నాలు గు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఏర్పడిన నష్టాన్ని అంచనా వేయాలని, బాధితులకు అండగా ఉండాలని ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారుల ను ఆదేశించారు. వర్ష ప్రభావాన్ని అంచనా వేసేందుకు జిల్లా యంత్రాంగంతో కలిసి శని, ఆదివారాలు పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జిల్లా అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అందరూ జిల్లా కేంద్రంలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకల వద్ద ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ, పోలీస్ అధికారులకు సూచించారు. వర్షం వల్ల తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, ప్రజలు వ్యాధుల బారిన పడితే తక్షణ చికిత్స అందించేలా వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉండాలన్నారు.
విద్యుత్ స్తంభాలు, వైర్లు తెగిపోయిన చోట విద్యుత్‌శాఖ సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో 5 ఇండ్లు పూర్తిగా, 28 ఇండ్లు పాక్షికంగా కూలిపోయినట్లు కలెక్టర్ వెంకట్రావు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నిరాశ్రయులకు వెంటనే భోజన వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. దెబ్బతిన్న రోడ్ల నివేదికలు, పంటలు, ఆస్తుల నష్టం వివరాలు సైతం సేకరించాలన్నారు. హెల్ప్ డెస్క్ కు వచ్చిన ఫోన్ కాల్స్ వెంటనే స్పందించి వాటిపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ధర్మాపూర్, బోయపల్లి ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో డీఎస్పీ మహేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేశ్ పాల్గొన్నారు.