వనపర్తి, జూలై 10(నమస్తే తెలంగాణ): పోలీసు కావాలంటే సరైన శిక్షణ ఉండాలి. పోటీ ప్రపంచంలో ముందుండాలంటే పరీక్షకు పాసయ్యేందుకు మెరుగైన కోచింగ్ తీసుకోవాలి. అదేవిధంగా ఫిజికల్ టెస్టులో నెగ్గాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలి. ఇవన్నీ గ్రామీణ విద్యార్థులకు అందని ద్రాక్షే. కోచింగ్‌కు వెళ్లాలన్న, శరీరాన్ని బలంగా తయారు చేసుకోవాలన్న డబ్బులతో కూడిన వ్యవహారం. నగరాలకు వెళ్లి ప్రత్యేక శిక్షణ అవసరం. అక్కడ ఉండటానికి ఇంటి అద్దెతోపాటు చాలా ఖర్చులుంటాయి. అమ్మాయిలు దూరం వెళ్లి కోచింగ్ తీసుకుంటామంటే తల్లిదండ్రులు ఒప్పుకునే పరిస్థితి ఉండదు.
పేద విద్యార్థినులైతే ఆశలు వదులుకోవాల్సిందే. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని వనపర్తి యువతీయువకులు ఉద్యోగాలు సాధించాలని జిల్లాకేంద్రంలో కోచింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లను మంత్రి నిరంజన్‌రెడ్డి చేశారు. సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్టు పేరుతో పోలీసులు, ఎస్సై ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న సుమారు 450మంది యువతీ యువకులకు ఉచిత వసతి, నిపుణులచే పోటీ పరీక్షల కోసం కోచింగ్, ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం, అందులో గుడ్డు, అరటిపండు తప్పనిసరిగా అందిస్తున్నారు. వారంలో ఒకరోజు చికెన్‌తో భోజనం పెడుతున్నారు.
ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు
ఎస్సై, కానిస్టేబుల్‌తోపాటు అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. సబ్ఇన్స్పెక్టర్ తత్సమాన పోటీ పరీక్షలకు ఆగస్టు 7న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు డిగ్రీ, పీజీ చదివిన వారు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. ఆగస్టు 21న పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష ఉంటుంది. వీటికోసం ప్రస్తుతం వనపర్తిలో యువతీ యువకులు శిక్షణ తీసుకుంటున్నారు. రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన పీజీఆర్ సంస్థ వీరికి ట్రస్టు ద్వారా కోచింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా అభ్యర్థులకు ఆర్థమేటిక్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ పాలిటీక్స్, తెలంగాణ హిస్టరీ తదితర 11సబ్జెక్టులను బోధిస్తున్నారు. ఈ ప్రోగ్రాం మొత్తాన్ని డీఎస్పీ ఆనందరెడ్డి ఆదేశాల మేరకు సీఐలు ప్రవీణ్‌కుమార్, శ్రీనివాసరెడ్డి, రత్నం పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థులకు నిత్యం గైడ్ చేస్తున్నారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్ తనవంతు సహాయంగా అభ్యర్థులకు పుస్తకాలు, పెన్నులు అందించారు. కోచింగ్ సెంటర్‌ను మం త్రి తన ఇంటి ఆవరణలోనే ఏర్పాటు చేశారు.
అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా..
మంత్రి సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్టు నుంచి విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. సేవలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. కోచింగ్‌కు వచ్చే ఏ అభ్యర్థికి ఇబ్బంది ఉండొద్దని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. ఎంత ఖర్చయిన వెనుకాడటం లేదు. ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమై విద్యార్థులకు ఉద్యోగాలు రావాలనే లక్ష్యంతో ట్రస్టు పనిచేస్తుంది. దీనికి మా ట్రస్టు చైర్మన్‌తోపాటు మంత్రి, పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
– గౌడనాయక్ , ట్రస్టు సభ్యుడు, సర్పంచ్
నమ్మకం పెరిగింది
ఉద్యోగం సాధిస్తామనే నమ్మకం పెరిగింది. మంత్రి నిరంజన్‌రెడ్డి సారు వసతి, భోజన ఏర్పాట్లు చేయడం సంతోషంగా ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు, సౌకర్యాలు కల్పిస్తున్న మంత్రి, ట్రస్టు నిర్వాహకులకు కృతజ్ఞతలు. పోలీసు అధికారులు వస్తుంటే వారిలా తయారవ్వాలనే కోరిక పెరుగుతుంది. పోలీసుశాఖలో చేరి యూనిఫాం వేసుకోవాలని కలలుగంటున్నాం.
– సీ చందన, అభ్యర్థి
నమ్మలేకపోయాం..
ఉచిత కోచింగ్ ఇస్తారంటే ఏదో మొక్కుబడిగా ఇస్తారనుకున్నా. కానీ ఇప్పుడు ఒక్క రోజు కూడా మిస్ కావాలనిపించడం లేదు. పక్కా జాబ్ సాధిస్తాను. సౌకర్యాలు కల్పించిన మంత్రి నిరంజన్‌రెడ్డి సార్‌కు, మమ్మల్ని దిశానిర్ధేశం చేస్తున్న పోలీసు అధికారులకు కృతజతలు. హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లినా ఇన్ని సౌకర్యాలు ఉండవు. ఇంట్లో కూడా ఇంత పౌష్టికాహారం అందించే అవకాశం లేదు.
– శకుంతల, అభ్యర్థి