నారాయణపేట, జూలై 7 : ‘మేక కాళ్లు ఎందుకు విరగొట్టావు’ అని అడిగేందుకు వచ్చిన పాపానికి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. నెల కిందట జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన బుడగ జంగం కిష్టప్పకు సంబంధించిన మేకపోతు.. అదే కాలనీకి చెందిన కుర్వ సూరప్ప దొడ్డిలోకి వెళ్లింది. దీంతో సూరప్ప మేక కాళ్లు విరగొట్టాడు.
అయితే, విషయం అడిగేందుకు వెళ్లిన కిష్టప్పపై సూరప్ప కుమారుడు రాకేశ్ కోపోద్రిక్తుడయ్యాడు. మా నాయనను పేరు పెట్టి పిలుస్తావా.. అంటూ కులం పేరుతో దూషించడంతోపాటు తన చేతిలో ఉన్న ఇనుప కడియంతో కిష్టప్పను రాకేశ్ నుదుటిపై కొట్టాడు. గాయపడిన కిష్టప్పను మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా దవాఖానకు తీసుకెళ్లారు. సంఘటనపై ఇరు కులాల పెద్దలు పంచాయితీ పెట్టినట్లు తెలుస్తున్నది. కాగా, చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం కిష్టప్ప మృతి చెందాడు. దీంతో కోపోద్రిక్తులైన మృతుడి బంధువులు రాకేశ్ ఇంటి ఎదుట మృతదేహంతో ధర్నా చేశారు.
నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే, గురువారం సాయంత్రం మళ్లీ మృతదేహంతో సెంటర్ చౌక్‌లో ధర్నా చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని సముదాయించి పంపించారు. శ్మశానవాటికలో మృతుడి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఈ ఘటనపై మృతుడి భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దవాఖానలో ఉన్న కారణంగా ఆలస్యంగా ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.