మూసాపేట(అడ్డాకుల), జూలై 1: అడ్డాకుల మండలంలోని పెద్దముగనల్చేడ్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులకు గానూ 71మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అందులో రెండు గదుల్లో అంగన్వాడీ కేంద్రాలు. నాలుగు గదుల్లో ఏడు తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి పెచ్చులు ఊడి పిల్లలపై పడి గాయాలయ్యేవి. పాఠశాలలో మరుగుదొడ్లు లేక, పిల్లలకు బెంచీలు, సారోళ్లకు కుర్చీలు లేక సమస్యల వలయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు నిత్యం ఇబ్బందులు పడేవారు. పాఠశాలకు పిల్లలను పంపాలంటే తల్లిదండ్రుల్లో భయం ఉండేది. పాఠశాలలో వసతులు కల్పించాలని ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డిని కలిశారు. పరిస్థితిని వివరించిన వెంటనే నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో నివేదికలు తయారు చేయాలని చెప్పారు.
నిర్మాణానికి ఏఈతో నివేదికలు తయారు చేయించి సూమారుగా రూ.40లక్షలు వరకు ఖర్చవుతుందని గ్రామస్తులు, ఉపాధ్యాయులు చెప్పడంతో వెంటనే అందుకు జెడ్పీటీసీ సానుకూలంగా స్పందించారు. సొంత ఖర్చుతో నల్లమద్ది లక్ష్మిదేవమ్మ, రాజేశ్వర్‌రెడ్డి స్మారకార్థం పాఠశాల భవన నిర్మాణం చేపట్టారు. స్థల కొరత వల్ల గ్రౌండ్‌ఫ్లోర్‌లో నాలుగు గదులు, జీ ప్లస్ 1లో మూడు గదులు నిర్మించారు. ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేట్‌కు దీటుగా కార్పొరేట్ పాఠశాలను తలపించేలా నిర్మించారు. మరుగుదొడ్లు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవసరమైన సామగ్రిని సైతం సొంత ఖర్చుతో ఇప్పించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న మనఊరు-మనబడి పాఠశాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. పాఠశాలను మంత్రి నిరంజన్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు.
దయాగుణుడు రాజశేఖర్‌రెడ్డి
అడ్డాకుల జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి అతి తక్కువ కాలంలోనే దయాగుణుడని పేరు సంపాదించుకున్నారు. సహాయం కోరిన వారికి కాదనలేకుండా తనకు తోచిన సహాయం చేస్తున్నాడు. అర్హత ఉండి ప్రభుత్వం నుంచి పింఛన్ డబ్బులు రానీ 12మందికి 18నెలలుగా ప్రతి నెలా ప్రభుత్వం ఎంత పింఛన్ అందజేస్తుందో అంత క్రమం తప్పకుండా అందజేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఆర్థికసాయం, కుటుంబ పెద్ద మరణిస్తే వారి పిల్లలు ఏవరైనా చదువుకుంటామంటే వారి చదువులకు అయ్యే ఖర్చును సొంతగా ఆయనే భరిస్తున్నారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న కులసంఘాల భవనాల నిర్మాణాలను జెడ్పీటీసీ సొంత ఖర్చులతో పూర్తి చేస్తున్నారు.
మారిన రూపురేఖలు
మొదట్లో ఆ పాఠశాలను చూసి ఇక్కడికి ఎందుకొచ్చానని అనిపించింది. పాఠశాల తరగతి గదుల్లో పెచ్చులూడి పడటంతో కొంతమంది గ్రామస్తులతో కలిసి జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డిని కలిసి పాఠశాల పరిస్థితిని వివరించాం. వెంటనే పాఠశాల నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో చెప్పాలని అన్నాడు. సొంత డబ్బులతో పాఠశాలను నిర్మిస్తానని చెప్పారు. వెంటనే పనులను ప్రారంభించి త్వరగా పూర్తిచేయించారు. దీంతో పాఠశాల రూపురేఖలు మారాయి.
– సంపత్, ఉపాధ్యాయుడు, పెద్దమునగల్‌చేడ్ పాఠశాల
కార్పొరేట్ తరహాలో నిర్మాణం
ప్రభుత్వ పాఠశాల అయినా ఖర్చుకు ఆలోచించకుండా కార్పొరేట్ తరహాలో పాఠశాలను నిర్మించారు జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి. గతంలో కూడా పాఠశాలకు సొంతంగా విద్యావలంటరీని నియమించి డబ్బులు చెల్లించేవారు. ఇప్పుడు పాఠశాలలో నాతోపాటు ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ విద్యాసంవత్సరం పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభమవుతుంది. ఉపాధ్యాయుల కొరతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తీర్చగలిగితే మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను.
– తార్సింగ్, హెచ్ఎం, పెద్దముగనల్చేడ్ పాఠశాల
చదువుకున్న పాఠశాలకు..
నా చిన్నతనంలో ఈ పాఠశాలలోనే విద్యాభ్యసం ప్రారంభమైనది. చదువుకున్న పాఠశాలకు నావంతు సహకారం అందించాలనే సంకల్పందితో పాఠశాలను సొంతంగా నిర్మించాను. పార్టీలకతీతంగా గ్రామస్తులంతా కలిసి నా భార్య విజయలక్ష్మిని ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. అంతేకాకుండా నన్ను గ్రామస్తులతోపాటు మండల ప్రజలు మంచి మెజార్టీతో జెడ్పీటీసీగా గెలిపించారు. ఉన్న దాంట్లో గ్రామస్తులకు, అడిగిన వారికి నా వంతు ఆర్థికంగా సహాయం చేస్తున్నాను.
– నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ, అడ్డాకుల