అయిజ, జూలై 1: 2022-23 ఏడాదికి గానూ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు ప్రభుత్వం నీటి కేటాయింపులు చేసింది. వానకాలంలో పండించే పంటలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. జిల్లాలో ప్రధానంగా పండించే పంటలకు అనుగుణంగా జూన్ 23న హైదరాబాద్లో జరిగిన ఎస్సీఐడబ్ల్యూఎం సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు నీటి కేటాయింపులు జరిపారు. వరి, మొక్కజొన్న, వేరుశనగ, మిరప, పత్తి, చెరుకు పంటలను రైతులు అధిక మొత్తం పండిస్తారు. ఉమ్మడి జిల్లాలోని జూరాల, నెట్టెంపాడు, భీమా, ఆర్డీఎస్, కల్వకుర్తి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల పరిధిలోని 4.4లక్షల ఎకరాల సాగుకు 43.690టీఎంసీలను కేటాయిస్తూ జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూరాల కింద 1,09296 ఎకరాలకు 15.500టీఎంసీలు, నెట్టెంపాడు ఎత్తిపోతల పరిధిలోని 1,42,000ఎకరాలకు 10టీఎంసీలు, రాజీవ్ భీమా ఎత్తిపోతల పరిధిలోని 67,796ఎకరాలకు 8.590 టీఎంసీలు, రాజోళిబండ డైవర్సన్ స్కీం పరిధిలోని 50 వేల ఎకరాలకు 6 టీఎంసీలు, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని 35,500ఎకరాలకు 3.600టీఎంసీల నీటిని కేటాయించింది. ఈ ఏడాది వానకాలంలో 5ప్రాజెక్టుల పరిధిలోని పంటల సాగుకు 43.690టీఎంసీలను కృష్ణా, తుంగభద్ర నదుల ద్వారా నీటిని తరలించనున్నారు. ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరుపడంతో సాగుకు అవసరమైన నీటిని సమృద్ధిగా తరలించేందుకు జలవనరుల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
4.4లక్షల ఎకరాలకు..
ఉమ్మడి జిల్లాలోని 5 సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టుకు ఈ ఏడాది వానకాలంలో 43.690టీఎంసీలు రాష్ట్ర జలవనరులశాఖ కేటాయింపులు జరిపింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4.04లక్షల ఎకరాలకు పుష్కలంగా నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జూరాల, నెట్టెంపాడు, భీమా, ఆర్డీఎస్, కల్వకుర్తి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తాం.
– రఘునాథరావు, సీఈ, జలవనరులశాఖ, పెబ్బేరు