అలంపూర్, జూన్ 25 : పట్టణంలోని షా అలీ పహిల్వాన్ ఉర్సు ముగిసింది. నాలుగు రోజులుగా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చివరి రోజైన శనివారం పెద్ద దర్గా వద్ద మహిళా ఉర్సు నిర్వహించారు. భక్తులు వారి వారి మొక్కు బడి ప్రకారం ప్రసాదాన్ని తీసుకొచ్చి దర్గాకు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంతకుముందు రాతి పడవలో ఉంచిన ప్రసాదాన్ని చుట్టూ చేరిన మహిళా భక్తులపైకి విసిరారు. ఇందుకోసం మహిళా పహిల్వాన్లు పోటీ పడ్డారు. ఎక్కడాలేని విధంగా అలంపూర్లో కేవలం మహిళలకే ఉర్సు కేటాయిచండం ఇక్కడి ప్రత్యేకత. ఈ సందర్భంగా దర్గా పరిసరాల్లో పురుషులకు అనుమతులు ఉండవు.. మహిళా పోలీసులే భద్రతా చర్యలు చేపట్టారు.
ఉత్సవాలను తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాలు, పట్టణాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. దర్గా పరిసరాల్లో వెలిసిన గాజుల దుకాణాల వద్ద ఆడపడచులకు, వారి బంధువులకు గాజులు వేయించారు. చిన్న పిల్లల కోసం ఆట వస్తువులు కొనుగోలు చేశారు. మరి కొంత మంది రంగుల రాట్నాలలో తిరుగుతూ సంబురపడ్డారు. నాలుగు రోజులుగా అలంపూర్లో బంధుమిత్రులతో ప్రతి ఇల్లు సందడిగా కనిపించింది. వీధులన్నీ విద్యుద్దీపాల వెలుగులో కాంతులీనాయి. అధికారులు, పోలీసులు అప్రమంగా ఉంటూ ఉర్సును విజయవంతం చేశారు.