వనపర్తి, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : సాహితీవేత్తలు, కవులు, రచయితలు గతాన్ని స్పృశిస్తూ.. వర్తమానాన్ని విశ్లేషిస్తూ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. అప్పుడే సాహిత్యానికి ఒక ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలమైన అంశాలపై రేపటి తరాల కోసం ఆలోచించి ఆదర్శవంతమైన సాహిత్యాన్ని అందించాలని కోరారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో అక్షర తపస్వీ ఆచార్య ఎస్వీ రామారావు 80 వసంతాల సాహితీ సౌరభం సందర్భంగా సాహితీ సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వయోధిక రచయితల సన్మానంతోపాటు కేతపల్లి రామచంద్రం శతకం, నాగలి దీర్ఘకాలిక పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సురవరం నుంచి ఇప్పటి వరకు సాహితీవేత్తలు, కవులు, కళాకారులకు ఎంతో పేరున్నదని చెప్పారు. గర్వ పడాల్సిన విధ్వత్ ఉన్న ప్రముఖులు ఉన్నారని తెలిపారు. ఇతర ప్రాంతాల వారు ఈ ప్రాంతాన్ని ఆదర్శంగా తీసుకుంటారని వివరించారు. దీర్ఘకాలిక మైనటువంటి రేపటి ప్రపంచానికి సంబంధించి ఒక మానవీయ కల్పనతో మనుషుల కోసం ఆలోచించే మనసున్న మనుషులున్న ప్రాంతమని కొనియాడారు. సాహిత్య సేవ చేయాలనే సంకల్పం ఉంటే వయస్సు అడ్డంకిగా ఉండబోదన్నారు. చాలా మందికి పాలమూరు పరిస్థితులపై అవగాహన ఉందని, నాటికీ.. నేటికీ అభివృద్ధిలో చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలు దేశ వ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తే అందులో సుమారు 700 మంది మృత్యువాత పడ్డారని, దీనిపై స్పందించి నాగలి పేరుతో యువకవి ఉప్పరి తిరుమలేశ్ రచన కొనసాగించడం గొప్ప విషయమన్నారు. వర్ధమాన విషయాలపై స్పష్టమైన అవగాహన కలిగి.. ఏది మంచో.. ఏది చెడో చెప్పగలిగిన బాధ్యతను సాహితీవేత్తలు, కళాకారులు, రచయితలు తీసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో వనపర్తి కేంద్రంగా జిల్లా సాహిత్య చరిత్రను ఆవిష్కరించుకోవడం కోసం గొప్ప సాహితీ సమావేశాన్ని, సభను ఏర్పాటు చేసుకోబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇక్కడి కవులు, రచయితలు, సాహితీవేత్తలు భాగస్వామ్యం కావాలని అన్నారు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వనపర్తి జిల్లా చరిత్ర గ్రంథాన్ని ఆవిష్కరించనున్నట్లు మంత్రి తెలిపారు.
అనంతరం వయోధిక కవులు, రచయితలను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, ఆచార్య ఎస్వీ రామారావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్, సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రోగ్రాం అధ్యక్షుడు డాక్టర్ వీరయ్య, కార్యదర్శి గుంటి గోపి, సగర సంఘం అధ్యక్షుడు తిరుపతయ్య సాగర్, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిట్యాల రాము, నాయకులు పాల్గొన్నారు.