గద్వాల, జూన్ 16 : తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి రైతుబీమా సొమ్ము కాజేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.5 లక్షలు రికవరీ చేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాలను విలేకరులకు ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ వెల్లడించారు. గట్టు మండల కేంద్రానికి చెం దిన మల్లమ్మ బతుకు దెరువు కోసం కర్ణాటకలోని రాయిచూర్‌కు వెలస వెళ్లింది. ఈ సమయంలో రైతుబంధు డబ్బుల కోసం వరుసకు కొడుకు, వార్డు సభ్యుడు నాగరాజుకు వ్యవసాయ భూమి పాస్‌బుక్‌తోపాటు ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్ అందించింది. ఇదే అదనుగా భావించిన నాగరాజు, అతడి స్నేహితుడు ఆలమంచి రాజు అలియాస్ రాజప్పతో చేతులు కలిపాడు. ఇద్దరూ కలిసి రైతుబీమా సొమ్ము కాజేసేందుకు కుట్ర పన్నారు.
అదే గ్రామానికి చెందిన నరసమ్మ మృతి చెందగా.. ఆమె పే రుకు బదులుగా బతికి ఉన్న మల్లమ్మ పేరు మీద డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని గట్టుకు చెందిన అంగన్వాడీ టీచర్ శశిరేఖకు మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఆమె ద్వారా గ్రామ కార్యదర్శి సుభావతికి విషయం తెలియజేశాడు. ఆమె విచారణ చేసి ధ్రువపత్రం అందజేస్తానని చెప్పింది. దీంతో ఆగ్రహించిన నాగరాజు నేను వార్డు సభ్యుడి.. నా మాట నమ్మరా.. అని ఆమెతో చెప్పడంతో కార్యదర్శి 2021 డిసెంబర్ 23న బతికి ఉన్న మల్లమ్మ మరణించినట్లు ధ్రువీకరణ పత్రం అందజేశారు. తర్వాత తప్పుడు ధ్రువపత్రాలతో రైతుబీమాకు దరఖాస్తు చేసుకున్నారు. 2022 ఫిబ్రవరి 15న రైతుబీమా కింద రూ.5 లక్షలు ఎస్బీఐ ఖాతాలో జమయ్యాయి.
అదే నెల 18న నాగరాజు, రాజప్ప బ్యాంకులో రూ.3 లక్షలు డ్రా చేశారు. రూ.లక్ష నాగరాజు తీసుకుని మిగతా రూ.2 లక్షలు రాజప్పకు ఇచ్చాడు. మిగిలిన రూ.2 లక్షలు నాగరాజు ఒక్కడే డ్రా చేసి తీసుకున్నాడు. ఈ విషయమై ఇద్దరూ గొడవ పడ్డారు. తర్వాత రాజప్ప నకిలీ బాగోతాన్ని బట్టబయలు చేశాడని ఎస్పీ తెలిపారు. వ్యవసాయశాఖ అధికారి భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టగా తప్పుడు మరణ ధ్రువపత్రంతో రైతుబీమా కాజేసినట్లు గుర్తించారు. ఇద్దరిపై గట్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సీఐ ఎస్ఎం బాషా విచారణ చేపట్టారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన ఎస్సై పవన్‌కుమార్, సిబ్బంది రమేశ్, కోటిని అభినందించారు.