కొల్లాపూర్ రూరల్, జూన్ 16 : సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అండతో కొల్లాపూర్ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. 18న కొల్లాపూర్‌లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యట న సందర్భంగా గురువారం సీఐ యాలాద్రి, ఆర్డీవో హనుమానాయక్, అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఏర్పాట్లను పర్యవేక్షించారు. హెలీప్యాడ్, బహిరంగ సభ స్థలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు బడుగు, బలహీన వర్గాలకు వరంగా మారాయన్నారు.
బంగారు తెలంగాణ కో సం అడుగులు పడుతున్నాయని చెప్పారు. యావత్తు దేశం నేడు తెలంగాణ వైపు చూస్తున్నదని పేర్కొన్నారు. ఇక్కడి సంక్షేమ పథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావడంతో నేడు కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి సెంటు, గుంట సాగులోకి వచ్చిందన్నారు. శ్రీవారి సముద్రం చెరువు నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా గోపల్‌దిన్నె రాజర్వాయర్కు నీటిని తరలించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ప్రభుత్వం రూ.147 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ లింక్ కెనాల్‌కు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.