మద్దూరు, జూన్ 16 : ప్రజారోగ్యమే ప్ర భుత్వ ధ్యేయంగా పనిచేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు, 30 పడకల దవాఖానను గురువా రం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. పట్నంలోని వైద్యం పల్లె వరకు వచ్చిందని.. పేదలకు కావాల్సిన ఆరోగ్య పరీక్షలు మండలకేంద్రంలో చేస్తున్నట్లు చెప్పారు. దవాఖానకు త్వరలోనే పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయిస్తామన్నారు. గతంలో ప్రభుత్వ దవాఖానల పరిస్థితి దయనీయంగా ఉండేదని.. టీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటయ్యాక స్థానికంగానే మెరుగైన వైద్యం అందుతుందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామన్నారు. అనంతరం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పాలమూరు ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చల్లాగా దీవిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమానంగా చూస్తుందన్నారు.
కొడంగల్ నియోజకవర్గానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కృష్ణానీళ్లు పారిస్తామన్నారు. గతంలో సీఎం కేసీఆర్ పాలమూరు వలసలను చూసి కంట తడి పెట్టేవారని, బీడు భూములు పచ్చని పంట పొలాలుగా మారితే వలసలు ఆగుతాయన్న సంకల్పంతో పీఆర్ఎల్ఐ కి శ్రీకారం చుట్టారన్నారు. ఓర్వలేని ప్రతిపక్షాల కారణంగా ప నులు ఆలస్యమవుతున్నాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయ భూములకు డిమాండ్ పెరిగిందన్నారు. కుల, మత పిచ్చి నాయకుల అహంకారానికి వాత పెట్టే సమయం ఆసన్నమైందన్నారు. పిట్టల దొరల మాటలు తమకు రావని.. తమది చేతల ప్రభుత్వమన్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. కోస్గి, కొడంగల్, మద్దూరు ప్రభుత్వ దవాఖానలను ఆధునీకరించామన్నారు.మద్దూరు పట్టణంలో రోడ్డు విస్తరణకు రూ.5 కోట్లు, దవాఖాన నిర్మాణానికి రూ.3.67 కోట్లు కేటాయించారన్నారు.
త్వరలో కానుకుర్తి, కోయిలకొండ రోడ్డు వరకు రోడ్డు విస్తరణను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వనజ, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, కలెక్టర్ హరిచందన, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఎంహెచ్‌వో రాంమనోహర్, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దవీరారెడ్డి, కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, సర్పంచ్ అరుణ, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటయ్య, నాయకులు సలీం, బాల్సింగ్, వీరేశ్‌గౌడ్, హన్మిరెడ్డి, తిరుపతిరెడ్డి, మైపాల్‌గౌడ్, గోపాల్, విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.