మహబూబ్‌నగర్, జూన్ 16 : తెలంగాణ సర్కార్ పారదర్శకతకు మారుపేరుగా నిలుస్తున్నది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నది. రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు బియ్యాన్ని మరింత పారదర్శకంగా పంపిణీ చేయనున్నది. రేషన్‌షాపుల్లో ఇప్పటివరకు ఉన్న పాత ఈ-పాస్ మిషన్ల కాలపరిమితి ముగియడంతో.. విజన్ టెక్ సంస్థ ద్వారా కొత్త ఈ-పాస్ యంత్రాలను సరఫరా చేస్తున్నది. కొత్త మిషన్లు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. రేషన్‌డీలర్లకు మిషన్లు పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ మిషన్ ద్వారా బియ్యం తూకంలో గ్రాము తేడా ఉన్నా ట్రాన్సాక్షన్ జరగదు. తూకం సరిగ్గా ఉంటేనే ట్రాన్సాక్షన్ ప్రక్రియ పూర్తి కావడంతోపాటు రశీదు వచ్చేలా విజన్ టెక్ సంస్థ ఈ-పాస్ యంత్రాలను రూపొందించింది. పారదర్శకంగా రేషన్ బియ్యం పంపిణీ చేయనుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 506 రేషన్‌షాపులు ఉన్నాయి. ఇప్పటివరకు 505 ఈ-పాస్ యంత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. ఈ యంత్రాలకు తూనికలు, కొలతల శాఖ అధికారులు స్టాంపింగ్ చేస్తున్నారు. యంత్రాలకు ఇన్స్టాలేషన్ విధానాన్ని మరింత వేగంగా పూర్తి చేసి.. వచ్చే నెల నుంచి నూతన యంత్రాలతో రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. జిల్లాలో వివిధ కారణాలతో 42 షాపులను అధికారులు నిర్వహిస్తున్నారు. మున్ముందు ఈ షాపులను రేషన్‌డీలర్లకు అప్పగించే అవకాశాలున్నాయి.
మరింత పారదర్శకంగా..
విజన్ టెక్ కంపెనీ తయారుచేసిన ఈ-పాస్ యంత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. వాటిని రేషన్‌షాపులకు సరఫరా చేశాం. వచ్చే నెల నుంచి నూతన మిషన్ల ద్వారా రేషన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. గ్రాము తేడా ఉన్నా ట్రాన్సాక్షన్ నిలిచిపోతుంది.
– వనజాత, డీఎస్వో, మహబూబ్‌నగర్