నారాయణపేట టౌన్, జూన్ 13: పట్టణంలోని వివిధ వార్డుల్లో పట్టణ ప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సోమవారం 1, 2, 4, 11, 18, 8తోపాటు ఆయా వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పిచ్చిమొక్కలు తొలగించడంతోపాటు రోడ్లును శుభ్రపరిచారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు చేపట్టడం, రోడ్డుకు ఇరువైపులా ముండ్ల కంపను తొలగింపజేశారు. మురుగు కాలువలను శుభ్రపర్చడంతోపాటు పలుచోట్ల విద్యుత్ సమస్యలను పరిష్కరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని పలువురు వార్డు కౌన్సిలర్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కౌన్సిలర్లు గురులింగప్ప, శిరీష, తఖీచాంద్, అనిత, అమీరుద్దీన్, రాఘవేందర్ వార్డు ప్రజలు పాల్గొన్నారు.
జోరుగా పల్లెప్రగతి పనులు
ఊట్కూర్, జూన్ 13: మండలంలోని ఊట్కూర్, చిన్నపొర్ల, పెద్దపొర్ల, బిజ్వారం, పెద్దజట్రం, మల్లేపల్లి, తిప్రాస్‌పల్లి, నిడుగుర్తి, కొల్లూరు, వల్లంపల్లి, పగిడిమర్రి గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం మండల ప్రత్యేక అధికారి, జెడ్పీ సీఈవో సిద్దిరామప్ప, ఎంపీడీవో కాళప్ప గ్రామాలను సందర్శించి పనులను పర్యవేక్షించారు. పల్లె ప్రగతిలో భాగంగా పాఠశాలలు, అంతర్గత రోడ్లను శుభ్రపర్చడం, డ్రైనేజీల్లో వ్యర్థాలను తొలగించడం, వాటర్ ట్యాంకులను శుభ్రపర్చడం వంటి పనులు చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచులు సూర్యప్రకాశ్‌రెడ్డి, మాణిక్యమ్మ, సుమంగళ కతలప్ప, సరోజ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న పల్లె ప్రగతి
నారాయణపేటరూరల్, జూన్13: నారాయణపేట మండల ంలోని జాజాపూర్, సిగారం, కోటకొండ, కొల్లంపల్లి, తిర్మలాపూర్లతోపాటు వివిధ గ్రామాల్లో పల్లెప్రగతి పనులు కొనసాగుతున్నాయి. సోమవారం ఆయా గ్రామాల్లో పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు పాఠశాల గదులను శానిటైజేషన్ చేశారు. జాజాపూర్ గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను కార్యదర్శి శ్రీనివాస్ పరిశీలించారు.