ఊట్కూర్, జూన్ 13 : రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను సోమవారం పునఃప్రారంభించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులకు స్వాగతం పలికేందుకు గుమ్మానికి మామిడి ఆకులతో తోరణాలు కట్టి ముస్తాబు చేశారు. నిడుగుర్తి యూపీఎస్‌లో విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేపట్టేందుకు విద్యార్థులకు కొత్తగా అడ్మిషన్లు కల్పించారు. తిప్రాస్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ఎంఈవో వెంకటయ్య సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై మాట్లాడుతూ..ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఫీజు లేకుండా అడ్మిషన్లు కల్పిస్తామని, ఏడాదికి ఉచితంగా రెండు జతల దుస్తులు, సన్న బియ్యంతో వండిన ఆహారాన్ని అందిస్తామని తెలిపారు. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులచే విద్యాబోధన ఉంటుందన్నారు. కార్యక్రమంలో సర్పంచులు సుమంగళ, యశోదమ్మ, ప్రధానోపాధ్యాయులు లక్ష్మారెడ్డి, గోపాలకృష్ణ, గురునాథ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
నారాయణపేట టౌన్, జూన్ 13: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పరిమళాపురం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శాంత అన్నారు. సోమవారం పరిమళాపురంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వార్డులో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి, అనంతరం మాట్లాడారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంతో విద్యాభోదన అందించడం జరుగుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. అనంతరం దాత మల్లికార్జున్ 50మంది విద్యార్థులకు పలకలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, నరేశ్, సింధూజ తదితరులు పాల్గొన్నారు.