నాగర్‌కర్నూల్/కొల్లాపూర్ రూరల్, జూన్ 13: నాగర్‌కర్నూల్ జిల్లాలో 18వ తేదీన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అనంతరం బిజినేపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి రూ.100కోట్లతో చేపట్టనున్న మార్కండేయ లిఫ్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా బిజినేపల్లిలో నిర్వహించే బహిరంగసభలో ప్రసంగించనున్నారు.
అనంతరం కొల్లాపూర్ మండలం సింగోటం శ్రీవారి సముద్రం నుంచి గోపల్‌దిన్నె రిజర్వాయర్ అనుసంధానంగా రూ.142కోట్లతో చేపట్టనున్న గ్రావిటీ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. కాలువ నిర్మాణంతో అదనంగా 32వేల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. అలాగే రూ.15కోట్లతో సింగోటం లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన, పీజీ మహిళా కళాశాల విద్యార్థుల వసతిగృహాన్ని మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే కొల్లాపూర్‌లో మామిడి ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని ప్రారంభించడంతోపాటు రూ.12కోట్లతో పట్టణంలోని డివైడర్ల ఆధునీకరణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన అనంతరం బహిరంగసభ ఉంటుందని తెలిపారు.