రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుదాం.. మనిషి శరీరంలో రక్తం ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది.. ప్రమాదాల బారిన పడినప్పుడు, గర్భిణులకు, శస్త్రచికిత్స సమయంలోనూ బాధితులకు రక్తం అవసరమవుతుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు చాలా మంది రక్తం సకాలంలో దొరకక ప్రాణాలను కోల్పోతున్నారు.. ప్రతి జిల్లాలోనెలకు కనీసం 250 యూనిట్ల రక్తం అవసరం అవుతుందని వైద్యుల అంచనా.. అయితే అంత స్థాయిలో రక్తం లభించడంలేదు. ఇలాంటి సమయంలో ఆరోగ్యంగా ఉండి 18 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేలా రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు.
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ/వనపర్తి రూరల్, జూ న్ 13 : రక్తం పంచాలంటే రవ్వంత మంచి మనస్సు ఉంటే చాలు ఎంతోమందికి ప్రాణం పోసినోళ్లమవు తాం.. అందులోని తృప్తి అనుభవించినోళ్లకు తప్ప ఇ తరులకు అంతుపట్టదు. మనం ఇచ్చే రక్తం మరొకరి ప్రాణాలను నిలుపుతుందన్న సత్యాన్ని గ్రహించిన ఎంతోమంది కొన్నేండ్లుగా రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, కాన్పు సమయంలో రక్తహీనతతో బాధపడే గర్భిణులకు సకాలంలో రక్తం అందక ప్రాణాల ను కోల్పోయే పరిస్థితి వస్తుంది. రక్తం కొరతను తీ ర్చేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నారు. జిల్లాలో ప్రతినెలా కనీసం 250 యూనిట్ల రక్తం అవసరం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండి 18ఏండ్లు పైబడిన ప్రతిఒక్కరూ రక్తదానం చేసేలా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించి స్ఫూర్తిని కలిగిస్తున్నారు. రెండేండ్లుగా కరోనాతో పూర్తిగా రక్తనిల్వలు తగ్గిపోవడంతో బాధితులకు సకాలంలో రక్తం అంద క మరణించిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ప్రజల్లో కరోనా భయం వీడి స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకొస్తున్నారు.
రక్తదానంతో ఎలాంటి నష్టం ఉండదు..
నేటి ఆధునిక ప్రపంచంలో కూడా రక్తదానం చేయడంపై చాలామందికి ఎన్నో అపోహలు ఉన్నాయి. రక్తదానంతో ఎంతోమందికి ప్రాణదానం చేసినట్లు అవుతుంది. రక్తదానంతో ఎలాంటి నష్టం ఉండదు. 18నుంచి 60ఏండ్లు కలిగి 45కిలోలకంటే ఎక్కువ బరువుగల ఆరోగ్యవంతులు రక్తదానం చేయవచ్చు. ఆరోగ్యవంతులైన ప్రతి వ్యక్తి శరీరంలో 5నుంచి 6లీటర్ల రక్తం ఉంటుంది. రక్తదాతల నుంచి కేవలం 350 మి.లీ. రక్తాన్ని మాత్రమే తీసుకుంటారు. దీనివల్ల శరీరంలో రక్తం కొరత అనేది ఏర్పడే పరిస్థితి ఉండదు. ఒకసారి దానం చేసిన వారు తిరిగి 12 వారాల తర్వాత రక్తదానం చేయవచ్చు. ఒక యూనిట్ రక్తదానంతో ముగ్గురి జీవితాలను రక్షించవచ్చు. రక్తదానంతో నిరాశతో కొట్టుమిట్టాడుతున్న తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవితాల్లో ఆశ నింపినవారమవుతాం. అలాగే గుండెపోటు, క్యాన్సర్ వంటి జబ్బులను దూరం చేస్తుంది. ఐరన్ శాతాన్ని క్రమబద్ధం చేస్తుంది. దాతల రక్తాన్ని సేకరించిన తర్వాత వివిధ పరీక్షలు నిర్వహించి దాతల బ్లడ్గ్రూప్తోపాటు పరీక్షల రిపోర్టు, ప్రశంసాపత్రం, డోనార్కార్డులను రెడ్‌క్రాస్ సొసైటీ అందజేస్తున్నది.
రక్తదాతల దినోత్సవం ఏర్పడిందిలా..
కీర్డ్లాండ్ స్టీనర్ అనే అమెరికన్ బయాలజిస్ట్‌గా, ఫిజిషియన్‌గా ఎన్నో ప్రయోగాలు చేసి రక్తాన్ని కనిపెట్టాడు. ఆయన పుట్టినరోజునే ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకొంటున్నారు. రక్తం మనందరినీ కలుపుతుందన్న నినాదంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10.80కోట్ల మంది రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం.
రక్తదాతలు తెలుసుకోవాల్సిన వాస్తవాలు..
రక్తదానం చేస్తే బలహీన పడటం జరగదు.
ప్రతి ఆరోగ్యవంతుడి శరీరంలో ఐదు నుంచి ఆరు లీటర్ల రక్తం ఉంటుంది. రక్తదానం చేసినప్పుడు కేవలం 350 మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే సేకరిస్తారు.
18 నుంచి 60ఏండ్లలోపు ఉన్నవారు, 45 కిలోలకుపైగా బరువు ఉన్న ఆరోగ్యవంతులు మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చు.
రక్తాన్ని సేకరించిన తర్వాత వారి బ్లడ్ గ్రూప్‌తోపాటు సిఫిలిస్, మలేరియా, హైపటైటిస్, ఎయిడ్స్ తదితర పరీక్షలు నిర్వహించి దాతలకు రిపోర్టు అందజేస్తారు.
వీళ్లు రక్తదానం చేయొద్దు..
శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు, క్యాన్సర్, గుండె జబ్బులు, ఉన్నట్లుండి బరువు తగ్గడం, డయాబెటిస్, హైపటైటిస్, ఆస్తమా, ఏపిలెప్సి, లెప్రసీ, కాలేయా వ్యాధులు, ఎండోక్రైన్ సమస్యలు, ఎయిడ్స్ లక్షణాలు కలిగిన వారు రక్తదానం చేయరాదు. దగ్గు, జలుబు, జ్వరం వంటి అస్వస్థత ఉన్నవారు, ఏదైనా చికిత్సలో భాగంగా మందులు వాడుతున్న వారు విషయాన్ని వైద్యులకు తెలియజేస్తే ఎప్పటిదాకా రక్తదానం చేయొద్దో చెబుతారు.