నారాయణపేట టౌన్, జూన్ 13: హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి పిల్లలకు నీళ్ల విరేచనాలు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శైలజ ఆదేశించారు. సోమవారం జిల్లా దవాఖానలోని పీపీ యూనిట్లో డయేరియా నివారణ పక్షోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంట్లో తయారు చేసుకున్న ఓఆర్ఎస్ ద్రావణాన్ని 24గంటల్లో తాగించాలన్నారు. చిన్నారులకు ఆరు నెలల తర్వాత తల్లిపాలతోపాటు అనుబంధ ఆహారాన్ని ఇవ్వాలన్నారు. డయేరియా నివారణ పక్షోత్సవాలను విజయవంతం చేసేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. అనంతరం మండలంలోని జాజాపూర్ గ్రామంలో డయేరియా నివారణ కార్యక్రమాలను పరిశీలించారు. కార్యక్రమంలో పీపీ యూనిట్ వైద్యాధికారి బాలాజీరావు, డీడబ్ల్యూవో వేణుగోపాల్, హెల్త్ సూపర్వైజర్ గోవిందరాజు, బాలింతలు, గర్భిణులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, మహిళలు పాల్గొన్నారు.
అతిసార నియంత్రణ కార్యక్రమం పరిశీలన
నారాయణపేటరూరల్,జూన్ 13: పేట మండలంలోని జాజాపూర్ గ్రామంలో ఉధృత అతిసార నియంత్రణ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి డాక్టర్ శైలజ, జిల్లా ఇమ్యూనైజేషన్ సూపర్ వైజర్ గోవిందరాజులు ఆకస్మికంగా పరిశీలించారు. ఇంటింటికీ ఓఆర్ఎస్ ప్యాకె ట్ల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించి పలువురికి స్వయంగా ప్యాకెట్లను అందజేశారు. ప్రతి ఇంటిలో 0-5 సంవత్సరాల పిల్లల వివరాలు నమోదు చేసుకోవాలని ఆశ వర్కర్లకు సూచించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం లక్ష్మీదేవమ్మ, ఆశవర్కర్లు జయమ్మ, ప్రమీల, అరుణ, మంజుల పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఊట్కూర్, జూన్ 13: సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఊట్కూర్ పీహెచ్సీ వైద్యుడు సాయికుమార్ అన్నారు. ఉధృత నీళ్ల విరేచనాలు నియంత్రణ పక్షోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక పీహెచ్సీలో ఎన్ఎంలు, ఆశ కార్యకర్తలకు అవగాహన శిబిరం నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభంలో ఐదేళ్లలోపు పిల్లలు నీళ్ల విరేచనాల వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా ఇంటింటికీ తిరిగి ఓఆర్ఎస్, జింక్ ట్యాబ్లెట్లు అందజేయాలని సూచించారు. సిబ్బందికి ఓఆర్ఎస్, జింక్ ట్యాబ్లెట్లను సరఫరా చేశారు. కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈవో విజయకుమార్, సూపర్వైజర్ మణిమాల, ఏఎన్ఎం శైలజ, ఫార్మసిస్ట్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.