వనపర్తి, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో తెలంగాణ ప్రజలకు ఒరిగేది సున్నా అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 60 ఏండ్ల తండ్లాటకు ఎనిమిదేండ్ల పాలనతో పరిష్కారం లభించిందని ఆయనన్నారు. కేసీఆర్ మార్గదర్శకంలో అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. ఆదివారం రేవల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్‌రెడ్డితో సహా మరో 40 మంది టీఆర్ఎస్లో పార్టీలో చేరారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో వీరికి కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వరాష్ట్రం సిద్ధించాక 24 గంటల ఉచిత కరెంట్ సరఫరా మన విజయమన్నారు. దేశంలోనే వ్యవసాయానికి ఉచిత కరెంట్ అందించడంతోపాటు రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, ఆసరా పథకాలతో పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. గురుకుల పాఠశాలలు దేశానికే ఆదర్శమని, దేశంలో అత్యధిక గురుకుల పాఠశాలలున్న రాష్ట్రం కూడా మనదే అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా మన రాష్ట్ర తరహా పథకాలు అమలు కావడం లేదన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నీళ్లందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అన్నారు. టీఆర్ఎస్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. అనంతరం వనపర్తి ఆర్టీసీ కాలనీలోని సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుముర్తి యాదవ్, కౌన్సిలర్ ప్రేమ్‌నాథ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు చిట్యాల రాము, టీఆర్ఎస్ దళిత సంఘం నాయకుడు కోళ్ల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరించేందుకే పల్లె నిద్ర
వనపర్తి రూరల్, జూన్ 5: రాష్ట్రంలోని ప్రతి పల్లెలో సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకే పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టినట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పెద్దగూడెం తండాలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డితో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా తండావాసులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో తండావాసులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ తండాకు సాగు నీళ్లు తెచ్చేందుకు రూ.18 కోట్లతో ప్రతి పాదనలు చేసి సీఎం కేసీఆర్‌కు ఫైల్ పంపించామన్నారు. అటవీ ప్రాంతంలో రెండు చెక్ డ్యాంల నిర్మాణాలకు ప్రాతిపాదనలు పెట్టగా ఒకటి మంజూరైందన్నారు. ఇప్పటికే రూ.35 లక్షల నిధులతో తండాలో సీసీ రోడ్లు చేపట్టామన్నారు. ప్రభుత్వ స్థలం ఎంత ఉంటే అందులో ఆట స్థలం ఏర్పాటు చేయాలని సూచించామన్నారు.
గిరిజన వికాస్ కింద ఇప్పటికే 19 బోర్లు వేయించామని, మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా రూ.25లక్షలు మంజూరు చేశామన్నారు. అనంతరం గిరిజన డిగ్రీ విద్యార్థిని శిరీష మాట్లాడుతూ తెలంగాణ వచ్చాకే తండాకు సాగునీళ్లు, కరెంటు చూస్తున్నామని, తండా పిల్లలు ఉన్నత చదువులు చదివేందుకు వందల గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి మా చదువులకు బాటవేస్తుందని భావోద్వేగంగా మాట్లాడింది. కార్యక్రమంలో ఎంపీపీ కిచ్చారెడ్డి, సర్పంచ్ జయలక్ష్మీభీముడునాయక్, ఎంపీటీసీ ధర్మానాయక్, డీఎఫ్‌వో రామకృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవికుమార్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నరసింహ, డీఆర్డివో నర్సింహ, మిషన్ భగీరథ అధికారి మేఘారెడ్డి, గొర్రెల కాపరుల సంఘం చైర్మన్ కురుమూర్తియాదవ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.