మహబూబ్‌నగర్, మే 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);ఉమ్మడి జిల్లాపై రైల్వే శాఖ శీతకన్ను ప్రదర్శిస్తున్నది. డబ్లింగ్ పనులు పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ మధ్య ఇంటర్సిటీ రైళ్లు రాకపోకలు సాగించడం లేదు. ఎంఎంటీఎస్ రైళ్లు కూడా హైదరాబాద్ నగరం వరకే పరిమితమవుతున్నాయి. కొన్ని ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ ట్రైన్లన్నీ రిజర్వేషన్ ఆధారంగా నడుస్తున్నాయి. దీంతో పాలమూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు ఈ రైళ్లలో సీట్లు లేక కష్టతరంగా ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇక ప్రత్యేక రైళ్లతోనూ ఒరిగేదేమీ లేదని వాపోతున్నారు. డోన్ వరకు డబ్లింగ్ పనులపై అధికారులు ఊసెత్తడం లేదు. 9 ఏండ్ల కిందట ప్రారంభమైన గద్వాల- రాయిచూరు రైల్వే లైన్లో నేటికీ వేళాపాళా లేకుండా ఒక్కటంటే ఒక్క డెమో రైలు నడుస్తున్నది. అది కూడా అందుబాటులో లేని సమయంలో రాకపోకలు సాగిస్తున్నా.. కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరాదికి బుల్లెట్ రైళ్లు ఇస్తున్న మోదీ సర్కార్ మనకు ప్యాసింజర్ భాగ్యం కూడా కల్పించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
మహబూబ్‌నగర్, మే 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ నుంచి విశాఖపట్నం మధ్య ఈ నెల 7 నుంచి 29వ తేదీ వరకు ఇరువైపులా 4 చొ ప్పున ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నారు. ఈ మే రకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. ట్రైన్ నెం 08585 విశాఖ నుంచి బయలుదేరి మహబూబ్‌నగర్ చేరుకుంటుంది. మహబూబ్‌నగర్ నుంచి ట్రైన్ నెం 08586 విశాఖకు బయలుదేరుతుం ది. తొలిసారిగా మహబూబ్‌నగర్ నుంచి దూర ప్రాం తాలకు ఓ రైలు వేశారని సంతోషిస్తున్నా.. ఉమ్మడి మ హబూబ్‌నగర్ జిల్లాపై రైల్వే శాఖ చూపుతున్న నిర్లక్ష్యం పై స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
డబ్లింగ్ పూర్తై రెండు నెలలు గడుస్తున్నా మహబూబ్‌నగర్ నుంచి సి కింద్రాబాద్కు ప్రత్యేకంగా ఇంటర్ సిటీ రైళ్లు నడపడం లేదని పేర్కొంటున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ నుంచి మహబూబ్‌నగర్ మీదుగా కర్నూల్, తిరుపతి, చెన్నై, బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాలకు ఎ క్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు రిజర్వేషన్ ఆధారంగా నడుస్తున్నాయి. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఈ రైళ్లలో సీట్లు లభించక ఇబ్బందులు తప్పడం లేదు. ఒకటో, రెండో జనరల్ బోగీలు ఉండే ఈ రైళ్లలో వెళ్లాలంటే నరకం కనిపిస్తున్నదని ప్రయాణికులు వాపోతున్నారు. అందుకే మహబూబ్‌నగర్ నుం చి కాచిగూడ లేదా సికింద్రాబాద్ వరకు ప్రత్యేకంగా ఇంటర్ సిటీ రైళ్లు నడపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎంఎంటీఎస్ రైళ్లను పొడిగించాలి..
నాంపల్లి, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వరకు నడిచే ఎంఎంటీఎస్ రైళ్లలో కనీసం ఓ మూడింటినైనా మహబూబ్‌నగర్ వరకు పొడిగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పూర్తయిన తరుణంలో ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు కూడా అవకాశం ఉన్నది. దీనిపై అధికారులు దృష్టి సారిస్తే ఉందానగర్, తిమ్మాపూర్, షాద్‌నగర్, బాలానగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్ రైల్వే ప్రయాణికులు హైదరాబాద్ చేరుకునేందుకు మరింత వెసులుబాటు ఏర్పడుతుంది.
మహబూబ్‌నగర్- డోన్ డబ్లింగ్ ఊసేదీ..
సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ పూర్తి చేసిన రైల్వే శాఖ మహబూబ్‌నగర్ నుంచి గద్వాల, కర్నూల్ మీదుగా డోన్ వరకు డబ్లింగ్ పనులు చేపట్టకపోవడంపై రైల్వే ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్-డోన్ సెక్షన్ డబ్లింగ్ పూర్తయితే చెన్నై, తిరుపతి, బెంగళూరు, మంగళూరు తదితర నగరాలకు చేరుకునేందుకు దగ్గరి మార్గం అందుబాటులోకి వస్తుంది. దీంతో ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది. త్వరగా గమ్యస్థానం చేరుకునేందుకు వీలవుతుంది. అలాగే ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్-కాజిపేట-విజయవాడ-గూడూరు మార్గంతోపాటు, సికింద్రాబాద్-వాడి-రాయిచూరు-గుంతకల్ మార్గం పై ఒత్తిడి తగ్గుతుంది. నూతన రైళ్లను పెంచే అవకాశం ఉంటుంది. రైల్వే అధికారులు దృష్టి పెట్టాల్సి ఉన్నది.
విశాఖ- మహబూబ్‌నగర్ రైళ్ల వివరాలు..
ఈ నెల 7, 14, 21, 28 తేదీల్లో (మంగళవారా లు) సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నం నుంచి రై లు నెం 08585 బయలుదేరి మరుసటి రోజు ఉ దయం 10:30 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు నెం 08586తో 8, 15, 22, 29 తేదీల్లో (బుధవారాలు) సాయంత్రం 6:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు జడ్చర్ల, షాద్‌నగర్, ఉందానగర్, కాచిగూడ, మల్కాజ్గిరి, నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడలో ఆగుతుంది. మహబూబ్‌నగర్ నుంచి దూరప్రాంతాలకు తొలిసారి ఓ రైలు నడపడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే రైలును రెగ్యులర్ రైలుగా మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వృథాగా గద్వాల-రాయిచూరు లైన్..
దేశంలోనే అత్యధిక ఆదాయం అందించే దక్షిణ మధ్య రైల్వే పై కేంద్రం, అధికారులు శీతకన్ను వేస్తున్నారు. తెలంగాణకు కొత్త రైళ్లు, లైన్లు కానీ కేటాయించకుండా అన్యాయానికి గురి చేస్తున్నారు. ఉత్తరాదికి బుల్లెట్ రైళ్లిచ్చి మనకు ప్యాసెంజర్ రైళ్లు కూడా ఇవ్వడం లేదు. 9 ఏండ్ల కిందట ప్రారంభించిన గ ద్వాల- రాయిచూరు రైల్వే లైన్లో నేటికీ వేళాపాళాలేని ఒక్క డె మో రైలు మాత్రమే నడుస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లే దు. ఆ రైలు కూడా ఎవరికీ అందుబాటులో లేని వేళల్లో తి ప్పుతూ.. ప్రయాణికులు లేని మార్గంగా ముద్ర వేస్తున్నారు. పెద్దగా ఆక్యుపెన్సీ లేని మార్గంగా చూపిస్తూ కొత్త రైళ్లు ఇవ్వకుండా వెనుకబడిన ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు.
రాయిచూరు నుంచి యాద్గిర్, తాండూరు మీదుగా చుట్టూ తిరిగి సుమారు 290 కి.మీ. ప్రయాణించే రైళ్లే కేవలం 4 నుంచి 5 గంటల్లో సికింద్రాబాద్ వస్తున్నాయి. కానీ రాయిచూరు నుంచి గద్వాల, మహబూబ్‌నగర్ మీదుగా కాచిగూడ వచ్చే డెమో రైలు మాత్రం 238 కి.మీ దూరం చేరుకునేందుకు 6 గంటలు పడుతున్నది. అనధికారికంగా మరో రెండు, మూ డు గంటలు అధికంగా సమయం తీసుకుంటున్నది. గత నెల 26న సాయంత్రం 5 గంటలకు రాయిచూరులో బయలుదేరిన డెమో రైలు కాచిగూడకు మరుసటి రోజు (మే 27) అర్ధరాత్రి 2 గంటలకు చేరుకున్నది. అంటే దాదాపు 9 గంటలలు పట్టింది.
ఆర్టీసీ బస్సులో వచ్చినా కేవలం 5 నుంచి 6 గంటల్లో హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంటే.. ఎప్పుడు గమ్యం చేరుకుంటుందో తెలియని రైలులో ప్రయాణించేందుకు ఎవరూ ధైర్యం చేయడం లేదు. అందుకే ఈ రైలులో ప్రయాణికులు సంఖ్య ఏ మాత్రం కనిపించదు. అయినా రైల్వే శాఖ అధికారుల్లో మాత్రం వీసమెత్తు కూడా చలనం రాదు. ఏదో మొక్కుబడిగా లైన్ వేశాం. ఆ లైన్‌పై ఓ రైలు తిప్పుతు న్నాం అన్నట్లుగా మారిపోయింది. అలా కాకుండా ఓ ప్రణాళిక ప్రకారంగా ఈ లైన్‌పై ఆక్యుపెన్సీ పెంచేలా కొత్తగా రైళ్లు వేసి ప్రయాణికులకు సౌకర్యంగా మార్చాల్సి ఉన్నది. సికింద్రాబాద్-వాడి మీదుగా రాయిచూరు వెళ్లే రైళ్లలో కనీసం రెండింటినైనా మహబూబ్‌నగర్- గద్వాల-రాయిచూరు మీదుగా తి ప్పాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రెగ్యులర్ రైళ్లు కావాలి..
తొలిసారిగా మహబూబ్ నగర్- విశాఖపట్నం మధ్య ప్రత్యేకంగా రైళ్లు వేయడం సంతోషమే. కానీ, వీటిని రెగ్యులర్ రైళ్లుగా తిప్పితేనే ప్రయోజ నం. కేంద్రంలోని బీజేపీ సర్కా ర్ ఈ ప్రాంతంపై శీతకన్ను వేస్తున్నది. మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ రైల్వే లైన్ డబ్లింగ్ కోసం 8 ఏండ్లు పట్టింది. మహబూబ్‌నగర్- డోన్ రైల్వేలైన్ డబ్లింగ్ పనులు ప్రారంభమే కాలేదు. ఆ పనులు ప్రారంభించి పూర్తయ్యే వరకు ఎంత కాలం పడుతుందో దేవుడికే ఎరుక. ఉత్తరాది రాష్ర్టాలకు బుల్లెట్ రైళ్లు ఇచ్చే కేంద్రం తెలంగాణపై మాత్రం తీవ్రంగా నిర్లక్ష్యం చూపిస్తున్నది. నేటికీ సింగిల్ లైన్, డీజిల్ ఇంజన్లతోనే ఇక్కడ రైళ్లు నడుస్తున్నాయి. ఎన్నాళ్లీ వివక్ష. ఈ ప్రాంతంలోని రైల్వే సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం.
– మీర్జా జావెద్ బేగ్, ఆర్టీఏ మెంబర్, మహబూబ్ నగర్