బెంగళూరు, జూన్ 13: కర్ణాటక ప్రభుత్వంలో గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి శాఖ కేటాయింపునకు సంబంధించి నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో సీనియర్ మంత్రి కృష్ణ బైరే గౌడ బాధ్యతలు స్వీకరించడాన్ని వాయిదా వేశారు. తన పరిధిలోకి వచ్చే శాఖల విషయంలో స్పష్టత లేదని ఆయన అన్నారు. తన బాధ్యతల విషయంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నుండి స్పష్టత కోరానని, అధికారికంగా బాధ్యతలు స్వీకరించే ముందు ముఖ్యమంత్రి నిర్ణయం కోసం వేచి చూస్తున్నానని శనివారం విలేకరులతో మాట్లాడుతూ గౌడ చెప్పారు. బాధ్యతల విషయంలో స్పష్టత ఉంటేనే జవాబుదారీతనాన్ని నిర్ధారించడం, ప్రజల అంచనాలను అందుకోవడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
జూన్ 3న మంత్రివర్గంలో చేరి గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి శాఖను పొందిన గౌడ కీలకమైన రెండు పట్టణ ప్రణాళికా సంస్థలైన బెంగళూరు అభివృద్ధి సంస్థ(బీడీఏ), బెంగళూరు మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ(బీఎంఆర్డీఏ)పై నియంత్రణను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకోవడం పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. గౌడకు గ్రేటర్ బెంగళూరు అథారిటీ(జీబీఏ)తోపాటు దాని పరిధిలోని ఐదు నగర కార్పొరేషన్లు, బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి, బెంగళూరు మెట్రో బాధ్యతలను అప్పగించినప్పటికీ బీడీఏ, బీఎంఆర్డీఏలను ఇందులో చేర్చకపోవడం ప్రస్తుత ప్రతిష్టంభనకు కారణమని తెలుస్తున్నది.