నిర్మల్, జూన్ 12(నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లాలో వరిధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. పంటల కొనుగోళ్లపై శుక్రవారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాలను మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 20,977మంది రైతుల నుంచి దాదాపు 1.58లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను కొని గోదాములకు తరలించినట్లు తెలిపారు.
ఇందుకు సంబంధించి రూ.380 కోట్లకు గాను ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రూ.133 కోట్లు విడుదల కాగా, రైతుల ఖాతాల్లో రూ.100 కోట్ల వరకు జమ చేశామన్నారు. త్వరలోనే మిగతా రైతులకు కూడా డబ్బులు జమవుతాయన్నారు. శుక్రవారం నాటికి జిల్లా వ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయన్నారు. ఇప్పటి వరకు మొత్తం 258 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.75లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఖానాపూర్ మండలం బాదన్‌కుర్తిలో ఒకటి, సారంగాపూర్ మండలం యాకర్పెల్లిలో మరొకటి మాత్రమే సెంటర్లున్నాయని, రెండు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు.
వారంలో జొన్నల కొనుగోళ్లు పూర్తి…
యాసంగిలో 44వేల ఎకరాల్లో రైతులు జొన్న పంటను సాగు చేయగా 14 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 30వేల మెట్రిక్ టన్నుల జొన్నలు రాగా, 20వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు. మూడు ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, జొన్నలను ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన జిల్లాలు రాష్ట్రంలో కేవలం రెండు, మూడు మాత్రమే ఉన్నాయని, అందులో మన నిర్మల్ జిల్లా కూడా ఉందన్నారు. సమర్థవంతంగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేసిన ఆయా శాఖల అధికారులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.
ఎరువుల కొరత లేకుండా చూస్తాం
ఈ వానకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు ఎరువుల కొరత రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 10,734 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలని సూచించారు. అధిక ధరలు వసూలు చేస్తే, 8977751754 నంబర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలన్నారు. ఇప్పటికే అధిక ధరలకు ఎరువులు విక్రయించిన పలు దుకాణాదారులకు నోటీసులిచ్చినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఈ నెల 26 నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ప్రజలకు మీడియా వేదికగా అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో డీఆర్డీవో విజయలక్ష్మి, మార్క్‌ఫెడ్ డీఎం మహేశ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి బీవీ.రమణ తదితరులు పాల్గొన్నారు.