కేటీదొడ్డి, మే 18: నడిగడ్డ ప్రాంతమంతా ఇక సస్యశ్యామలం కానున్నదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కేటీదొడ్డి మండలంలోని గజ్జెలమ్మ గట్టు వద్ద నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకానికి అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, రాష్ట్ర కన్జ్యూమర్ ఫోరం మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్పతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ ఇక్కడి ప్రజల చిరకాల కోరిక గట్టు ఎత్తిపోతల పథకమని, ఈ రిజర్వాయర్ పూర్తి అయితే గట్టు, కేటీదొడ్డి, ధరూర్ మండలాలతోపాటు అలంపూర్ నియోజకవర్గ రైతులకు కూడా ఎప్పుడు సాగునీరు అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లాలోనే ఇది ఎత్తైన ప్రాంతమని అందుకే గజ్జెలమ్మ గట్టు వద్ద నిర్మిస్తున్నట్లు తెలిపారు. దాదాపు రూ.580 కోట్లతో చేపట్టే రిజర్వాయర్ పనులకు మొదటి విడుతగా రూ.328 కోట్ల వ్యయంతో పనులకు భూమిపూజ చేసినట్లు తెలిపారు. గతంలో పాలించిన నాయకులు ఇక్కడి ప్రజలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా చూశారని దుయ్యబట్టారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని మండలాలు అభివృద్ధి చెందాయన్నారు. మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు అప్పట్లో గజ్జెలమ్మ గట్టు వద్దే గట్టు ఎత్తిపోతల పథకం చేపట్టాలన్న ఆయన కోరిక నెరవేరిందన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి కెనాల్‌కు గట్టు భీముడు పేరు పెడతామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టుకు దాదాపు 900ఎకరాల భూమి అవసరమైందని, ఆ భూముల రైతులకు మూడు నెలల్లో సహాయం అందేలా చూస్తామన్నారు. ప్రతి ఎకరాకూ గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. సంవత్సరంలోపు గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పూర్తి చేసి పొలాలకు నీళ్లు అందజేస్తామన్నారు.
గట్టు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి వెనక పడడం తన కళ్లారా చూశానని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం తెలిపారు. ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం ప్రజల అదృష్టమన్నారు. మీరంతా చప్పట్లతో ఎమ్మెల్యేకు అభినందనలు తెలపాలన్నారు. అప్పటి భగీరథుడు నీటిని భూమి మీదకు తెస్తే మన ముఖ్యమంత్రి భగీరథుడుగా మారి నీటిని ఇంటింటికీ, ప్రతి పొలానికి తెస్తున్నాడన్నారు.
గతంలో దుర్మార్గులు డిజైన్ మార్చారు
గట్టు భీముడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చిన డిజైన్‌ను, కొందరు దుర్మార్గులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని డిజైన్ మార్చారని రాష్ట్ర కన్జ్యూమర్ ఫోరం మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఉపయోగపడే విధంగా గట్టు భీముడు చేసిన డిజైన్‌ను మార్చి రాయలసీమకు ఉపయోగపడేలా నీళ్లు మళ్లించారన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే బండ్ల పట్టుబట్టి ఈ ప్రాంతానికి సాగునీరు వచ్చే విధంగా కృషి చేశారన్నారు. అంతకుముందు ఇంతమంది ప్రజలను చూస్తుంటే ముందే ఎన్నికల్లో గెలిచి ప్రమాణస్వీకారం చేస్తున్నట్లు ఉందని ధరూర్ జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వర్‌రెడ్డి చెప్పడంతో సభ ఈలులు, హర్షధ్వానాలతో మార్మోగింది.
1.32 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్
గట్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా 1.32 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పూర్తివ్యయం రూ.518 కోట్లుకుగానూ మొదటి దశలో రూ.328 కోట్ల పనులకు టెండర్లు పూర్తయ్యాయి. పనులకు జీవీఆర్, ఎంఎస్ఆర్, నవయుగ కంపెనీలు సంయుక్తంగా చేపట్టనున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. పనులు పూర్తయితే గట్టు, కేటీదొడ్డి, ధరూర్ మండలాల్లో 33వేల ఎకరాలకు సాగునీరు అందనుంన్నదని వివరించారు. ప్రధానంగా నెట్టెంపాడు ద్వారా సాగునీటికి నోచుకోని ఎత్తు ప్రాంతంలో ఉన్న గట్టు మండలంలోని రాయపురం, ఎల్లందొడ్డి, తారాపురంతోపాటు కేటీదొడ్డి మండలంలోని మల్లాపురం, కుచినేర్ల, నందిన్నె, చింతలకుంట, కేటీదొడ్డి, యర్సన్‌దొడ్డి, సుల్తాన్పురం, సోంపురం తదితర గ్రామాల్లోని బీడు భూములకు నీరందనున్నదని తెలిపారు.
కార్యక్రమంలో గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామేశ్వరమ్మ, ఎంపీపీలు విజయ్, మనోరమ, నజీమున్నీసాబేగం, రాజారెడ్డి, జెడ్పీటీసీలు రాజశేఖర్, పద్మావెంకటేశ్వర్‌రెడ్డి, బాసు శ్యామల, వైఎస్ ఎంపీపీ రామకృష్ణానాయుడు, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఉరుకుందు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు హనుమంతు, సర్పంచులు , ఎంపీటీసీలు పాల్గొన్నారు.