కల్వకుర్తి, మే 5: రాహుల్ గాంధీ అడుగుపెట్టిన చోట కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుండటంతో ఐరన్లెగ్గా మారిపోయాడని మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ ఎద్దేవా చేశారు. గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ మాట్లాడారు. కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసినా అక్కడ కనుచూపు మేర కాంగ్రెస్ పార్టీ కనిపించకుండా పోతుందని, ఇందుకు చక్కని ఉదాహరణ పంజాబ్ రాష్ట్రమేనని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ సొంత నియోజకవర్గం నుంచి రాహుల్ ఓడిపోయాడంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దీనావస్థలో ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. రైతు సంఘర్షణ యాత్ర పేరుతో తెలంగాణలో అడుగుపెడుతున్న రాహుల్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ ఉనికి కనుమరుగు అవుతుందేమోనన్న అనుమానం కలుగుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో నాయకులే లేరని, అందుకే టీడీపీ నుంచి రేవంత్‌రెడ్డిని అరువు తెచ్చుకుని పీసీసీ అధ్యక్షుడిని చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోవడం ఖాయమన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ కంటే ఏఏ సంక్షేమ పథకాలను ఎక్కువగా అమలు చేస్తున్నారో తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి లేని అభివృద్ధి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి అభివృద్ధి చేశారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అసలు టీఆర్ఎస్కు పోటీయే కాదని చిత్తరంజన్‌దాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, ఎంపీపీ మనోహర, మున్సిపల్ స్పెషల్ నాలెడ్జ్ పర్సన్ మనోహర్‌రెడ్డి, గోపాల్ పాల్గొన్నారు.