కోస్గి, మే 4: పట్నం చదువులు పల్లెకు దగ్గరవ్వాలన్న సంకల్పం.. గ్రామీణప్రాంత విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశం..ఆర్థిక ఇబ్బందులతో చదువుకు, కొలువుకు దూరం కావొద్దనే గతంలో ఎన్నడూ ఎవరూ చేయని ఓ ఆలోచనకు సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఉచిత కోచింగ్సెంటర్ను ఏర్పాటుచేసి నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేయగా త్వరలో ఆయా శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తున్నది. గ్రామీణప్రాంత పేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో డబ్బు ఖర్చుచేసి కోచింగ్ తీసుకోలేరన్న ఉద్దేశంతో చదువుకు పేదరికం అడ్డుకాకూడదని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గి పట్టణంలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని పీజేఆర్ కోచింగ్సెంటర్ అధ్యాపకులతో కోచింగ్ అందిస్తున్నారు. ప్రభుత్వరంగంలో కొడంగల్ విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలని కోచింగ్సెంటర్ ప్రారంభించడంతో విశేషస్పందన లభిస్తున్నది. ప్రస్తుతం 350 మంది శిక్షణ పొందుతున్నారు. వారికి ఉచితంగా మెటీరియల్ సైతం ఎమ్మెల్యే సొంతఖర్చుతో అందిస్తున్నారు. కోచింగ్కు కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, కోస్గి, మద్దూర్, దౌల్తాబాద్,బొంరాస్పేట్ మండలాలనుంచి విద్యార్థులు హాజరవుతున్నారు.
మా విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలనే..
కొడంగల్ వెనుకబడిన ప్రాంతం..హైదరాబాద్కు దూరప్రాంతం. ఇక్కడి విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలని, ప్రభుత్వ ఉద్యోగాలూ సాధించాలని పీజేఆర్ కోచింగ్సెంటర్ సిబ్బందితో కోచింగ్ ఇప్పిస్తున్నాం. విద్యార్థులనుంచి మంచి స్పందన వచ్చింది. వారికి ఎలాంటి అవసరం ఉన్నా అన్ని ఏర్పాట్లు చేస్తా. అందరూ బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలి. ప్రస్తుతం కానిస్టేబుల్, గ్రూప్-4 ఉద్యోగాలకు కోచింగ్ ఇప్పిస్తున్నాం.
– పట్నం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే
కోచింగ్ మాకు చాలా ఉపయోగం
కర్ణాటక సరిహద్దులో ఉంటూ హైదరాబాద్కు దూరంగా ఉన్న మా ప్రాంతంలో నిరుపేదలు అధికం. కాబట్టి మేము హైదరాబాద్లో కార్పొరేట్ స్థాయిలో ఖర్చు పెట్టుకోలేం. ఇక్కడే ఉచితంగా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం ఆనందదాయకం.
– నరేశ్, కోస్గి
ఎలాగైనా ఉద్యోగం సాధిస్తా..
నేను కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నా. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సార్ మా గురించి ఆలోచించి కోచింగ్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. సార్ ఆశయం మేరకు తప్పక ఉద్యోగం సాధిస్తా.
– శ్రీకాంత్, కోస్గి