మక్తల్ టౌన్, మే 4 : మక్తల్ మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చేందుకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అధికారులు దృష్టి సారించారు. బల్దియాలో తొమ్మిది వేల కుటుంబాల నుంచి సేకరించిన చెత్తను నిల్వ చేసేందుకు ఎమ్మెల్యే సహకారంతో రూ.47.50 లక్షలు వెచ్చించి కర్ని రోడ్డులో డంపింగ్ యార్డును నిర్మించారు. డంపింగ్ యార్డ్‌కు తరలించిన తడి, పొడి చెత్త నుంచి డబ్బులు సంపాదించేందుకు పూనుకున్నారు. జిల్లాలోనే మొట్టమొదటిగా మక్తల్ మున్సిపాలిటీలో శ్రీకారం చుట్టారు. ఇందుకుగానూ రూ.13 లక్షలతో ఇన్సినిరేటర్, రూ.5 లక్షలతో వేస్ట్ ష్రెడ్డర్ పరికరాలను కొనుగోలు చేశారు. పొడి చెత్త కోసం ఇన్సినిరేటర్, తడి చెత్త కోసం వేస్ట్ ష్రెడ్డర్ను వినియోగించనున్నారు.
పరికరాల పనితీరు..
ఇన్సినిరేటర్‌లో రెండు పద్ధతులు ఉంటాయి. పొడి చెత్తను రీసైకిల్ (ప్లాస్టిక్, బాటిల్స్, కప్ బోర్డ్, గ్లాస్, మెటల్ వంటివి), నాన్ రీ సైకిల్ (మాస్క్, డైపర్, చెత్త పేపర్లు వంటివి)గా వేరు చేస్తారు. రీ సైకిల్ వస్తువులను నేరుగా అమ్మడానికి వీలు అవుతుంది. నాన్ రీసైకిల్ వస్తువులను ఇన్సినిరేటర్ పరికరంలో వేసి 1000 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడిచేస్తే ఫ్లైయాష్, ఫ్లైయాష్ కార్బన్, ఆక్టివేటెడ్ కార్బన్ పదార్థాలు వస్తాయి. వీటిని మార్కెట్లో విక్రయించొచ్చు. ఈ పరికరం ద్వారా చుట్టుపక్కల పరిసరాలకు హాని కలిగించే వాయువులు వెలువడవు. అదేవిదంగా వేస్ట్ ష్రెడ్డర్‌లో కట్ చేసి కోకో పీట్‌ను కలిపి 20 రోజుల పాటు బస్తాల్లో నిలువ ఉంచుతారు. ఇలా నిలువ ఉంచిన తడిచెత్త సేంద్రియ ఎరువు తయారవుతుంది.
ఉపయోగాలు..
తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువు, పొడి చెత్త నుంచి ఫ్లైయాష్, ైఫ్లైయాష్ కార్బన్, ఆక్టివేటెడ్ కార్బన్ పదార్థాలు తయారీ చేస్తున్నారు. సేంద్రియ ఎరువును పొలాలకు వినియోగించనున్నారు. అదేవిధంగా ఫ్లైయాష్(బూడిద)ను ఇటుక తయారీకి, ఫ్లైయాష్ కార్బన్‌ను ఫార్మింగ్‌కు, ఆక్టివేటెడ్ కార్బన్‌ను మెడిసిన్ తయారీ, గోల్డ్ ప్యూరిఫికేషన్‌లో వాడుతారు. వీటిని విక్రయించి బల్దియాకు ఆదాయం సమకూర్చుకోనున్నారు.
పరుగులు పెడుతున్న అభివృద్ధి..
మక్తల్ మున్సిపాలిటీలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. డంపింగ్ యార్డును మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించాం. అలాగే మున్సిపల్ సమావేశ భవనం, సమీకృత మార్కెట్‌ను అందుబాలోకి తీసుకొచ్చాం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మినీట్యాంక్ బండ్‌పై పార్క్ నిర్మాణానికి భూమి పూజ చేశాం. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం. మున్సిపల్ కార్యాలయాన్ని నిర్మించేందుకు ప్రపోజల్ పంపించాం. అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా కృషి చేయాలి. – చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే
ట్రయల్న్ చేశాం..
డంపింగ్ యార్డులో తడి, పొడి చెత్త నుంచి ఆదాయం సమకూర్చేందుకు ఇన్సినిరేటర్, వేస్ట్ ష్రెడ్డర్ యంత్రాలు కొనుగోలు చేశాం. నిర్వహణ బాధ్యతను మునేరా ఇంజినీరింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారికి అప్పగించాం. ఫ్లైయాష్, ైఫ్లైయాష్ కార్బన్, ఆక్టివేటెడ్ కార్బన్ తయారీకి కేజీకి రూ.4 చొప్పున ఖర్చు అవుతుంది. ఇన్సినిరేటర్‌లో ఒక టన్ను చెత్త వేసి ట్రయల్ రన్ నిర్వహించాం. పరికరాలు మంచిగా పనిచేస్తున్నాయి. – నర్సింహ, మున్సిపల్ కమిషనర్, మక్తల్