మహబూబ్‌నగర్, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సామాన్యు ల వివరాలతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఖాతాలు సృష్టించి పలువురి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల నారాయణపేట కలెక్టర్ పేరిట 8210616845 నెంబర్‌పై నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించి ఓ అధికారి నుంచి రూ.2.40 లక్షలు దోచేశాడు. పేట ఘటన మరవక ముందే ఉమ్మడి జిల్లాలో మరో కలెక్టర్ పేరిట కూడా నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు సదరు కేటుగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నారాయణపేటకు చెందిన ఓ వ్యక్తి నుంచి బిట్కాయిన్ల ద్వారా భారీ లాభాలు వచ్చేలా చేస్తామంటూ సైబర్ మోసగాళ్లు రూ.40 లక్షలను స్వాహా చేశారు. ఉన్నత విద్యావంతులే సైబర్ మోసగాళ్ల బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.
పేట కలెక్టర్ పేరిట దోపిడీ..
గత నెల 15న గుర్తు తెలియని వ్యక్తి నారాయణపేట కలెక్టర్ హరిచందన ప్రొఫైల్ ఫొటోతో వాట్సాప్ ఖాతా తెరిచాడు. దాని నుంచి పలువురు ఉన్నతాధికారులు, ఇతరులకు సందేశాలు పంపించాడు. కేటుగాళ్ల వలలో పడిన జిల్లా స్థాయి మాజీ అధికారి అమెజాన్ పే యాప్ నుంచి 8210616845 నెంబర్‌కు రూ.2.40 లక్షలు పంపించాడు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేసి నారాయణపేట పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. ఈ నకిలీ వాట్సాప్ నెంబర్‌తో నారాయణపేట జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సంబంధం లేదని, దాని నుంచి వచ్చే సందేశాలను ఎవరూ నమ్మొద్దని కలెక్టర్ హరిచందన పత్రికా ప్రకటన విడుదల చేసి ప్రజలు, అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా రూ.2.40 లక్షలను ఒక్క ఫేక్ డీపీ ఉన్న వాట్సాప్ ఖాతాతో దోచుకున్నారు. ఉన్నత విద్యావంతులే మోసగాళ్ల బారిన పడుతున్న వేళ సైబర్ నేరగాళ్లతో సామాన్యులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నది.
పాలమూరు కలెక్టర్ పేరిట నకిలీ ఖాతా..
మహబూబ్‌నగర్ కలెక్టర్ పేరిట సైబర్ నేరగాళ్లు నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించారు. కలెక్టర్ వెంకట్రావు ఫొటోను డీపీగా పెట్టి అధికారులు, ఇతరులకు సందేశాలు పంపించి డబ్బులు కావాలని అడిగారు. దీనిని గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘తాను సమావేశంలో ఉన్నానని, ఫోన్ చేయలేకపోతున్నానని, డబ్బులు అవసరం ఉంది వెంటనే పంపించాలి’ అంటూ కలెక్టర్ డీపీ ఉన్న వాట్సాప్ ఖాతా నుంచి అధికారులు, ఇతర ప్రముఖులకు సందేశాలు పంపిస్తున్నారు. అకౌంట్ డీటేయిల్స్ మాత్రం సైబర్ నేరగాళ్లవి పంపుతున్నారు. నిజమే కావొచ్చని భావించి సదరు అధికారులు డబ్బులు పంపిస్తే అంతే సంగతి. మొత్తమ్మీద ఉమ్మడి జిల్లాలో సాక్షాత్తు కలెక్టర్ల పేరిటే బురిడీ కొట్టించేందుకు సైబర్ మోసగాళ్లు చేసిన ప్రయత్నాలు కలకలం రేపుతున్నాయి.
బిట్‌కాయిన్ పేరిట రూ.40 లక్షలు..
నారాయణపేటలో ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి ఆన్లైన్లో బిట్ కాయిన్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి రూ. 40 లక్షలు మోసపోయాడు. క్రిప్టోకరెన్సీ గేట్ వేను తలపించే ఓ ఫేక్ వెబ్సైట్లో బిట్కాయిన్ల కోసం మొదట రూ.1.30 లక్షలు చెల్లించాడు. ఆయనకు దాదాపుగా రెట్టింపు లాభం వచ్చిందని సైబర్ మోసగాళ్లు నమ్మించారు. మంచి లాభం వచ్చిందని విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, ట్రాన్సాక్షన్‌కు రూ.20వేల కు పైగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.20 వేలు ఫీజు వృథాగా చెల్లించడమెందుకని ఫేక్ ట్రేడింగ్ చేస్తూపోయాడు. ఈ ఏడాది జనవరి నెలలో ట్రేడింగ్ ప్రారంభించి.. మార్చి 25 వరకు రూ.40 లక్షలు బిట్కాయిన్ల కోసం వెచ్చించాడు. తాను పెట్టిన పెట్టుబడి.. వచ్చిన లాభాన్ని తీసుకునేందుకు ప్రయత్నించగా అకౌంట్లోకి డబ్బులు బదిలీ కాలేదు.
వెంటనే సదరు వెబ్సైట్ వాళ్లను సంప్రదించేందుకు ప్రయత్నిస్తే సమాధానం రాలేదు. అడ్రస్ కనుక్కొని ముంబయి వెళ్లగా.. అసలు అటువంటి సంస్థే లేదని, వారంతా మోసగాళ్లని తెలుసుకొని హైదరాబాద్‌లో సైబర్ క్రైం పోలీసులను బాధితుడు సంప్రదించాడు. నారాయణపేట జిల్లా పరిధిలో ఘటన జరిగినందున అక్కడే ఫిర్యాదు చేయాలని పంపించారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పేట పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, ఎలాంటి చట్టబద్ధత లేని నకిలీ వెబ్సైట్లలో క్రిప్టోకరెన్సీ పేరిట ఒకేసారి రూ.40లక్షలు మోసపోవడం చూస్తే సైబర్ నేరగాళ్లు ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారో అర్థం అవుతున్నది. అప్రమత్తంగా లేకుంటే డబ్బంతా కేటుగాళ్లు దోచుకునే ప్రమాదం ఉన్నది.
అప్రమత్తంగా ఉండాలి..
కలెక్టర్ ఫొటోతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి డబ్బులు డ్రా చేసిన వ్యక్తి జార్ఖండ్ రా ష్ర్టానికి చెందిన వారిగా గుర్తించాం. విచారణ ముమ్మరం చేశాం. ఫేక్ సిమ్‌తో అమెజాన్ పేకు డబ్బులు బదిలీ చేయించుకున్నాడు. విచారణలో భాగంగా వివరాల కో సం అమెజాన్ సంస్థకు లేఖ రాశాం. వారి నుంచి సమాచారం రావాల్సి ఉన్నది. ఫేక్ వాట్సాప్ సందేశాలు, ఫేస్బుక్లో ఉన్నతాధికారుల పేరిట డబ్బులు కావాలని అడిగితే నమ్మొద్దు. అనుమానాస్పదంగా ఎవరైనా డబ్బులు అడిగితే వివరాలను టోల్ ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేసి సమాచారం ఇవ్వాలి. బిట్‌కాయిన్స్‌లో పెట్టుబడి పెట్టి రూ.40 లక్షలు పోగొట్టుకున్న ఘటనలో బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చే పట్టాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్పీ, నారాయణపేట