మహబూబ్‌నగర్, మే 2 : పాఠశాలలు పునఃప్రారంభం నాటికి మనఊరు-మనబడి కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులతో మాట్లాడారు. సాధ్యమైనంతవరకు అన్ని పాఠశాలలను పరిశీలించి నిధుల మంజూరుకు ప్రతిపాదనలను పం పాలని సూచించారు. రూ.30లక్షలలోపు ఖర్చు ఉన్న పనులను ఈనెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని, రూ.30లక్షలు దాటిన పాఠశాలలకు సంబంధించి నెలాఖరులోగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. అలాగే ఇంటర్, పదోతరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలను ప్రశాంతం గా నిర్వహించాలని సూచించారు. మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. పనుల్లో నాణ్యత ఉండాలన్నారు. అలాగే పనుల ప్రారంభోత్సవానికి విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు.
వైద్యసేవలను మరింత చేరువ చేయాలి
వైద్యసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దవాఖానల్లో తాగునీరు, శానిటేషన్ వంటి చిన్నచిన్న సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. 108,102, అమ్మఒడి, ఆలన వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆర్బీఎస్కే సేవలను తిరిగి ప్రారంభించి ప్రతి పాఠశాలల్లో విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించేలా చూడాలన్నారు. ప్రైవేట్ దవాఖానల్లో సాధారణ కాన్పులు చేయాలని, సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించాలని సూచించారు. ఇందుకు కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో డాక్టర్లు అందుబాటులో ఉండాలన్నారు. అవసరమైతే వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఖాళీలను భర్తీ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ ఎస్.వెంకట్రావు వైద్యారోగ్య శాఖ అధికారులతో వీసీ నిర్వహించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వీసీలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్, కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్ నందలాల్ పవార్, డీఈవో ఉషారాణి, డీఎంహెచ్‌వో కృష్ణ, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ రమేశ్ తదితరులు ఉన్నారు.