పెబ్బేరు, మే 1: వేసవిలో దాహాన్ని తీర్చడంతో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది మట్టికుండ. సహజతత్వం కలిగిన మట్టి పాత్రల వాడకం, నీటిని సేవించడం ఆరోగ్యానికి ఎంతో మేలు. మట్టికుండలో సహజసిద్ధంగా చల్లబడిన నీటిని తాగడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. పూర్వీకులు మట్టిపాత్రల్లోనే ఆహారపదార్థాలు వండటం, పానీయాలు తయారు చేసుకోవడం వంటివి చేసుకునేవారు. ప్రస్తుత కాలంలో మట్టి పాత్రలకు ప్రజలు దూరమై రకరకాల ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, మెటల్ వస్తువులను వినియోగిస్తున్నారు. పూర్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి మట్టికుండలను వాడేవారు. పట్టణ ప్రాంతాల్లో రానురాను ఫ్రిజ్‌ల వాడకం పెరిగిపోయింది. దీంతో మట్టి కుండలకు ఆధారణ కరువైపోతుంది. ప్రస్తుతం మట్టిపాత్రల వాడకం వల్ల కలిగే లాభాలను తెలుసుకుంటున్న సామాన్య జనం, సంపన్నులు మళ్లీ మట్టిపాత్రల వైపు చూస్తున్నారు. పేదోడి ఫ్రిజ్‌గా పిలువబడుతున్న మట్టికుండలకు గిరాకీ ఏటేటా పెరుగుతున్నది.
చల్లదనంతోపాటు మినరల్స్..
మట్టి పాత్రల ద్వారా సేవించిన నీటిలో సహజంగా మినరల్స్ లభిస్తాయి. మట్టి పాత్రల్లో వాతావరణంలో ఉండే గాలితో బాష్పోత్సేకం ప్రక్రియతో మట్టికుండలోని సూక్ష్మరంధ్రాలు ఉపయోగపడి నీటిని సహజసిద్ధంగా చల్లబరుస్తాయి. అంతేకాకుండా మట్టి కుండలకు ఉన్న గుణంతో నీరు చల్లబడటమే కాకుండా, శుద్ధ, శ్రేష్ఠమైన నీరు తయారవుతుంది. మట్టితో తయారు చేసిన కుండలతో కొన్ని పోషకాలు నీటితో జతకలిసి ఉండటంతో ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. పూర్వకాలంలో ప్రజలు అన్ని కాలల్లో మట్టితో చేసిన పాత్రలతోనే నీటిని చల్లబరుచుకునేవారు. దీని ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదని పెద్దలు, వైద్యులు చెబుతుంటారు.
రోగ నివారిణిలు
మట్టిలో ఎన్నో ఖనిజ లవణాల మిశ్రమం ఉంటుంది. మట్టిపాత్రలను తయారు చేసే మట్టిలో ఉండే క్షారగుణం వల్ల మానవ శరీరానికి ఆసిడిటీ సమస్య లేకుండా చేస్త్తుంది. ఈ నీళ్లు తాగడంతో గ్యాస్ట్రిక్ నొప్పులు రాకుండా కాపాడడంతో పాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సాధారణంగా ప్లాస్టిక్ పాత్రలో నిల్వ ఉన్న నీరును తాగడం వల్ల అందులో ఉండే రసాయనాల వల్ల మానవ శరీరానికి సమస్యలు తలెత్తుతాయి. జీవక్రియ సమతుల్యంగా ఉండదు. కానీ మట్టిపాత్రల వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.
కుండతో ప్రయోజనాలు
నీటిని సహజంగానే చల్లబరుస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
గ్యాస్, ఎసిడిటీని తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
దగ్గు, జలుబు, ఆస్తమాలను నివారిస్తుంది.
శరీరానికి అనేక పోషకాలు అందుతాయి.
శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తుంది.
వడదెబ్బ నుంచి కాపాడుతుంది.
మెటబాలిజం రేటు పెరుగుతుంది.
ఆరోగ్యానికి ఎంతో మేలు
మా చిన్నతనంలో ప్రతి ఇంట్లోనూ మట్టితో చేసిన వాటిల్లోనే వంట చేసేవారు. వాటిని కుండ, కూర అటికె, కడవ, చిప్పలు అంటూ పిలిచేవాళ్లం. మట్టికుండల్లో వండిన భోజనం రుచే వేరుగా ఉండేది. మా పెద్దలు మట్టికుండల్లో వండిన భోజనం తిని ఎంతో చలాకీగా, ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన స్టీల్, ప్లాస్టిక్, ఐరన్ పాత్రలు రావడం ఆహారం పూర్తిగా కలుషితమైపోతుంది. రసాయనాలతో తయారు చేసిన వస్తువుల్లో వండిన ఆహారం, నిలువుంచిన త్వరగా పాడవుతుంది. మట్టి పాత్రలు ఉపయోగించడం, అందులో వండిన ఆహారం తీసుకోవడం, నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
-ఎం.సురేందర్‌రెడ్డి, పెబ్బేరు