మహబూబ్‌నగర్, మే 1: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలో నిర్మిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన పనులను మరింత వేగవంతం చేయాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టీఎస్ఐఐసీ అధికారులతో ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రం నిర్మాణ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాకు మరో మణిహారంగా ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. అవసరమైన లేఅవుట్ రూపొందించి పనులను వేగవంతం చేయాలన్నారు. పనులు ముందుకు తీసుకుపోవడంలో ఎలాంటి వెనకడుగు వేయకూడదని నిర్ధేశించిన సమయంలోపు పనులు పూర్తి కావాలని కలెక్టర్, సంబంధిత అధికారులకు తెలియజేశారు. కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.
పనులు పక్కాగా జరగాలి
మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ పనులను పెద్ద చెరువులో నిర్మించనున్న ప్రతిపాదిత ఐలాండ్ పనులు గుర్రపు డెక్క తొలగింపు పనులనుతోపాటు సస్పెన్షన్ బ్రిడ్జి ఏర్పాటు, వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను కలెక్టర్‌తో కలిసి ఆదివారం పరిశీలించారు. చెరువు పూడిక తీత పనులను వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు వెంటనే పర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపలల్ చైర్మన్ తాటి గణేశ్, కౌన్సిలర్లు కిశోర్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆడబిడ్డల పెండ్లికి భరోసా కల్యాణలక్ష్మి
మహబూబ్‌నగర్ రూరల్, మే 1: ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మితో పేదింటి ఆడబిడ్డల పెండ్లి బాజా మోగుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని హైటెక్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 23 మంది లబ్ధిదారులకు రూ.23,02,668 కల్యాణలక్ష్మి, 72 మంది లబ్ధిదారులకు రూ.26 లక్షల 49 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. విద్యా, వైద్య, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. అనంతరం రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దుస్తులు పంపిణీ చేశారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు మల్లు దేవేందర్‌రెడ్డి, రూరల్ తాసిల్దార్ పాండు, ఆర్ఐ నర్సింగ్ నాయక్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, జిల్లా ఫిష్ ఫెడరేషన్ అధ్యక్షుడు శాంతయ్య యాదవ్, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, కౌన్సిలర్లు మెహసిన్, ఖాజాపాషా, కోఆప్షన్ అల్లావుద్దీన్, కిశోర్, మోతిలాల్, నవకాంత్, రాంలక్ష్మణ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్, సర్పంచులు, నాయకులు రాఘవేందర్‌గౌడ్, పాండురంగారెడ్డి, సురేందర్‌గౌడ్ పాల్గొన్నారు.