వనపర్తి, మే 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధనతో నూతన ఒరవడి రానున్నదని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని చెప్పారు. ఆదివారం వనపర్తి జిల్లా కడుకుంట్ల, పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామాల్లోని పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న దాంట్లో అధిక మొత్తం ఈ రెండు రంగాలకే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని గ్రహించి విద్య, వైద్యం పేదలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేశామని పేర్కొన్నారు.
జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నందున అధునాతన వైద్య చికిత్స కోసం పట్టణాలకు వెళ్లే ప్రయాస లేకుండా జిల్లా కేంద్రాల్లోనే అందుబాటులోకి వైద్య సేవలు తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే వైద్యరంగంలో సంస్కరణలు చేపట్టి పేదలకు అందుబాటులో ఉండేలా బలోపేతం చేశామన్నారు. ప్రస్తుతం విద్యా రంగంలో మెరుగైన మార్పుల కోసం ప్రణాళికలు సిద్ధం చేసి పాఠశాలలు, కళాశాలల్లో అమలు పర్చుతున్నట్లు తెలిపారు. ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 26,173 పాఠశాలల మరమ్మతులు, మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. వీటి కోసం రూ.9,123 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రారంభం కాబోతుందన్నారు.
పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి పిల్లలను ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. రెండు నెలల్లో మౌలిక సౌకర్యాల కల్పన, మరమ్మతులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. దేశమంతా చాలా రాష్ర్టాల్లో కరెంటు లేకున్నా.. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవన్నారు. వనపర్తి జిల్లాలో మొత్తం 1,000 పడకలతో వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. వచ్చే నెల నుంచి ప్రభుత్వం కొత్త పింఛన్లు అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. సొంత స్థలం ఉంటే గృహ నిర్మాణానికి రూ.3లక్షలు అందజేస్తామని చెప్పారు. గుమ్మడం పాఠశాల అభివృద్ధికి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద రూ.28.49 లక్షలు, కడుకుంట్ల పాఠశాలకు రూ.29.70 లక్షలు ఖర్చు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిలబడటం గొప్ప విషయమని కొనియాడారు. కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ ‘మన ఊరు-మనబడి’ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమన్నారు.
వీరోచిత పోరాటమే మే డే
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే 1886 అమెరికాలోని చికాగో నగరం హే మార్కెట్లో 8గంటల పనిదినం అమలు కోసం, వెట్టిచాకిరీనుంచి విముక్తి, కనీస హక్కుల కోసం కార్మికులు సాగించిన వీరోచిత పోరాటమే మేడే అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. మేడే సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆవరణలో స్థానిక నాయకులతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి పార్టీ జెండాను ఎగురువేశారు. అనంతరం కార్మిక సంఘాల నేతలను శాలువాతో ఘనంగా సన్మానించారు.
అభివృద్ధిని చూసే ఆకర్షితులై..
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తిప్పాయిపల్లి గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్, టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మహేశ్వర్‌రెడ్డి, కోళ్ల వెంకటేశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ చైర్మన్ లోకనాథరెడ్డి, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ విజయ్‌కుమార్, డీఈవో రవీందర్, పెబ్బేరు ఎంపీపీ శైలజ, జెడ్పీటీసీ పద్మ, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, సహకార సంఘం చైర్మన్లు వెంకట్రావు, మధుసూదన్‌రెడ్డి, ఎంఈవోలు జయరాములు, శ్రీనివాస్‌గౌడ్, కడుకుంట్ల సర్పంచ్ హరిత, వనపర్తి వైస్ ఎంపీపీ సువర్ణ, పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల, పార్టీ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, గ్రంథాలయ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, కౌన్సిలర్లు సత్యం, నారాయణ, లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శులు పరంజ్యోతి, రమేశ్, నాయకులు తిరుమల్, వెంకటేశ్, విక్రమ్ పాల్గొన్నారు.
కోతల మేరకు కొనుగోలు కేంద్రాలు
వనపర్తి రూరల్, ఏప్రిల్ 1: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం కోతల మేరకు ఆయా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పలు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, ఎంపీపీ కిచ్చారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కూడా మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండించి ఆర్థికంగా ఎదగాలని కోరారు. వానకాలంలో పత్తి, పప్పు, నూనె గింజల పంటలు సాగు చేయాలన్నారు. అంతకుముందు పెద్దగూడెంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, నాగవరం, అంకూర్‌లో ఎంపీపీ కిచ్చారెడ్డి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమాల్లో సహకార సంఘం చైర్మన్లు వెంకట్రావు, మధుసూదన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నరసింహ, డీసీవో క్రాంతి, సివిల్ డీఎం అనిల్, ఏవో కురుమయ్య, వైస్ చైర్మన్ శివకుమార్, తిరుమల మహేశ్, రవికుమార్, మార్కెట్ డైరెక్టర్ నరేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం, మండల యూత్ అధ్యక్షుడు గణేశ్ నాయుడు, సీఈవో కృష్ణ పాల్గొన్నారు.
ఇఫ్లార్ విందులో మంత్రి
కొత్తకోట, మే 1: కొత్తకోట పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌విందులో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, ఎంపీపీ గుంతమౌనిక, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మాజీ జడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్‌తో పాటు తాసిల్దార్ బాల్‌రెడ్డి పాల్గొన్నారు. జామ మసీద్‌లో మైనార్టీ చైర్మన్ ఇంతియాజ్, ఎమ్మెల్యేలు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీట వేసిందన్నారు. విద్యాభివృద్ధికి తోడ్పడుతూ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థికి రూ.లక్షా 25వేలు ఖర్చు చేస్తుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కృష్ణయ్యయాదవ్, ఇంద్రయ్యసాగర్, కౌన్సిలర్లు ఖాజామైనొద్దీన్, అలీం, వసీంఖాన్, లాలు, చాంద్‌పాషా, మసీద్, రజీయోద్దీన్, రామ్మోహన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.