గద్వాల, ఏప్రిల్ 28 : రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తున్నది. పంట మార్పిడి చేసి రైతులు లాభాల బాట పట్టేలా కృషి చేస్తున్నది. డి మాండ్ ఉన్న పంటలను సాగు చేసి ఆర్థికవృద్ధి సాధించాలని సూచిస్తున్నది. రోజురోజుకూ పెరుగుతున్న వం ట నూనెల లోటును పూడ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు దీర్ఘకాలంగా ఆదాయం అందించే ఆయిల్‌పాం సాగుకు చేయూతనందిస్తున్నది. రైతులను ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున సబ్సిడీలు అందజేస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా నేలలు సాగుకు అనుకూలం కావడంతో ఆయిల్‌పాం సాగు చేపట్టాలని రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. గతేడాది జిల్లాలో 356 మంది రైతులు 1,479.62 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగుచేశారు.
ఈ సారి 6,203 ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించారు. ఇటిక్యాల మం డలం బీచుపల్లి వద్ద తెలంగాణ రాష్ట్ర నూనె ఉత్పత్తి స హకార సంఘం లిమిటెడ్ ద్వారా మొక్కలు పెంచుతున్నారు. ఆసక్తి ఉన్న రైతులు మే 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఉద్యానవన శాఖ అధికారులు కోరుతున్నారు. దరఖాస్తులను గద్వాల క్షేత్రస్థాయి అధికారి శివకుమార్ (96035 99080), అలంపూర్‌లో బాలప్రకాశ్ (94916 21138), శశిధర్‌గౌడ్ (77995 45418) వద్ద నమోదు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకున్న రైతులకు సంబంధించిన పొలంలో విద్యుత్ సౌకర్యం, నీటి లభ్యతను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మొక్కలు అందజేస్తారు. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి రాయితీపై మొక్కలతోపాటు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందజేయనున్నారు. గ్రామాల్లోని వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద దరఖాస్తును తీసుకొని సంబంధిత పత్రాలు జతచేసి పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు శ్రీనివాసాచారి (79977 25197), రాజశేఖర్ (79977 25198)ను సంప్రదించాలి. రైతులు పొలాన్ని చదును చేసి 2 ఫీట్ల గుంతలో త్రికోణాకృతిలో 9 మీటర్ల దూరంతో ఎకరాకు 57 మొక్కలు వచ్చేటట్టు మార్కింగ్ చేసుకొని గుంతలు తీసుకోవాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సురేశ్ తెలిపారు.