మహబూబ్‌నగర్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : సమైక్యవాదుల అరాచకాలను..తెలంగాణకు అడుగడుగునా జరుగుతున్న అన్యాయాన్ని చూసి తెలంగాణవాదుల నెత్తురు మరిగింది.. సీమాంధ్రుల పెత్తనాన్ని, ఇక్కడి ప్రాంతంపై అసమానతలను ధిక్కార స్వరంతో ఎదుర్కొని ఒక్కడిగా తన ప్రయాణం మొదలుపెట్టారు ఉద్యమ నేత కేసీఆర్. తన ఆలోచనల నుంచే అస్థిత్వం, ఆత్మగౌరవ నినాదంతో 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం సాక్షిగా టీఆర్ఎస్ పురుడుపోసుకున్నది. ఒక్కడిగా మొదలై జెండా చేత పట్టి, వేలు..లక్షలాది మందిని కదిలించారు. ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో ఇబ్బందులు తట్టుకొని స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చేలాచేసింది ఆ జెండానే.. తొలి,మలి అన్ని దశల్లోనూ, ఉద్యమాల్లోనూ ఉమ్మడిపాలమూరు తనపాత్రను పోషించింది. పదవులను సైతం గడ్డిపోచల్లా విసిరేశారు ఇక్కడి నేతలు. ఉద్యమ కాలం నాటి రోజులను నెమరువేసుకుంటూ పునర్నిర్మాణంలో దూసుకుపోతున్న పాలమూరుపై, బుధవారం టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
టీఆర్ఎస్ పార్టీ 21 ఏండ్ల ప్రస్థానం పడిలేచిన కెరటాన్ని తలపిస్తున్నది. పడిపోయిన ప్రతిసారీ లేచి తన ఉనికిని కాపాడుకున్నది. ప్రత్యేక రాష్ట్రమే ఏకైక అజెండాగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ ప్రయాణంలో వైఫల్యాలు, విజయా లు దోబూచులాడాయి. ఉద్యమ నేత కేసీఆర్ ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలే ప్రాణం పోశాయి. తెలంగాణ నినాదం, భావన వ్యక్తిగత స్థాయి నుంచి వ్యవస్థీకృతంగా మార్చడంలో, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను వ్యాపింపచేయడంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ వాదాన్ని విస్తరించే క్రమంలో కేసీఆర్ వెంట ఉమ్మడి పాలమూరు జిల్లా కలిసి నడిచింది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ సమీపంలో జలదృశ్యం కేంద్రంగా 2001 ఏప్రిల్ 27న కొంతమంది తెలంగాణవాదుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పాలమూరు నుంచి వేళ్లపై లెక్క పెట్టే స్థాయిలో ఉద్యమకారులు హాజరయ్యారు. పార్టీ ఏ ర్పాటు తర్వాత దశలవారీగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు.
ఇప్పటి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే డా.సి.లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్లో కీలకంగా వ్య వహరించారు. కార్యకర్తలు వెంట రాకపోయినా గ్రామగ్రామానికి తిరిగి తెలంగాణ వాదాన్ని వినిపించారు. 2001 జూన్ 1వ తేదీన మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ పా ర్టీ భవిష్యత్ కార్యాచరణను ఉద్యమ నేత కేసీఆర్ వినిపించారు. చెంతనే కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా.. సాగు, తాగు నీళ్లు లేని దుస్థితిని వివరించారు. 2003 జూలైలో ఆర్డీఎస్ రైతుల ఆవేదనను ప్ర పంచానికి తెలిపేందుకు అలంపూర్ నుంచి గద్వాలకు ఎనిమిది రోజులు పాదయాత్ర చేపట్టారు. దారిపొడవునా టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు ఆవశ్యకత.., స్వరా ష్ట్రం సాధించుకుంటే లాభమేంటి.. అని వివరిస్తూ వచ్చారు. 2008లో పాలమూరు ప్రజాగర్జనతో స్వరాష్ట్రం సాధించడమే ఏకైక ఎజెండా అని పిలుపునిచ్చారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న క్షణా న ఉద్యోగ సంఘాల నేతగా నేటి మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సైతం ఉద్యమ రథసారధి కేసీఆర్ వెంట రాష్ట్రమంతా కలిసి నడిచారు.
రాష్ట్రమే రాదన్నారు.. తెచ్చి చూపించారు…
మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రత్యేక తెలంగాణ ఉద్య మం ప్రభావమే లేదని సమైక్యవాదులు అనేకమార్లు గేలి చేశారు. అయితే 2009లో ఉద్యమ నేత కేసీఆర్ ను మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిపించి పాలమూరు ప్రజలు ప్రత్యేక రాష్ట్ర సాధనలో తమ వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆకాశమే హ ద్దుగా దూసుకుపోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వా త కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా టీఆర్ఎస్ పార్టీ కి అండగా ఉంటూ వచ్చింది. తొలిసారి జరిగిన అ సెంబ్లీ ఎన్నికల్లో సగం ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకున్నది. ఐదు స్థానాల్లో కాంగ్రెస్, రెండు చోట్ల టీ డీపీ గెలిచాయి.
టీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మక్తల్, నారాయణపేట ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. ఆ విధంగా టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో నిలిచింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విశ్వరూపం చూపించింది. ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గం మినహా ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల్లోనూ అధికార పార్టీ నేతలు గెలిచారు. ప్రతిపక్షాలు నామరూపాలు లేకుండాపోయాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తన నియోజకవర్గం అభివృద్ధి కాంక్షించి టీఆర్ఎస్లో చే రారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా ప్రతిపక్షానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్న చరిత్ర లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రెండు ఎం పీ స్థానాలతో పాటు అన్ని జెడ్పీ చైర్ పర్సన్, 99 శాతం ఎంపీపీ లు, జెడ్పీటీసీలు, పీఏసీసీఎస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకున్నది. రాజకీయంగా దాదాపుగా అన్ని పదవులు అధికార పార్టీ చేతిలోనే ఉన్నాయి. దీంతో అభివృద్ధి పనులు చేయడం సులువుగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకొని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడంతోపాటు సుమా రు 10 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నారు. దీంతోపాటు ప్ర స్తుతం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూ ర్తయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో కృష్ణమ్మ సందడి చేయనున్నది. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు ము న్ముందుకు సాగిపోతున్నది. అన్ని జిల్లాలకు మెడికల్ కళాశాలల తో వైద్యపరంగా ఉహించని మార్పులు చోటు చేసుకుంటున్నా యి. సంక్షేమ రంగంలోనూ సీఎం కేసీఆర్ మార్కు కనిపిస్తున్నది.
రాజీనామాతో ఉద్యమానికి దన్నుగా..
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమనేత కేసీఆర్ పిలుపుతో 2008 ఏప్రిల్‌లో ఆనాటి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేగా ఆ యన ఘనత వహించారు. ఇలా ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాలమూరు తన వంతు పాత్రను పోషించిందని చెప్పొచ్చు. 2009లో కేసీఆర్ చేపట్టిన దీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విశేషమైన మద్దతు లభించింది. దీక్షాదివస్ రోజున వేలాది మంది విద్యార్థులు రహదారులపైకి వచ్చారు. కేసీఆర్ ఆరోగ్యం విషమించిందని తెలిసి.. అనేకమంది ఆవేదన చెందా రు. 2010లో పాలమూరుకు చెందిన విద్యార్థులు కావలి సువర్ణ, దాసరి నరేశ్ ఆత్మార్పణ చేయడం ఉమ్మడి పాలమూరు జిల్లాను కదిలించింది. టీఆర్ఎస్ చేస్తున్న పోరాటాన్ని, తెలంగాణవాదాన్ని జనం పెద్ద ఎత్తున స్వాగతించారు. 2011లో నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ నుంచి కొల్లాపూర్ వరకు సుమారు 200 కిలోమీటర్ల మేర తెలంగాణ సాధన పాదయాత్ర నిర్వహించారు.
2012లో సడక్‌బంద్ చేపట్టిన టీఆర్ఎస్ ముఖ్య నేతలు, ఉద్యోగ సంఘాల నేతలను అరెస్టు చేసి మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలించినప్పుడు… ఉద్యమ నేత కేసీఆర్ పాలమూరు చేరుకొని అరెస్టయిన నేతలకు సంఘీభావం తెలిపారు. తెలంగాణ ఏర్పాటు త్వరలోనే సాధ్యమవుతుందని ఆరోజే ప్రకటించారు. ఎట్టకేలకు 2013లో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 2014 మే నెలలో జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నికల బరిలోకి దిగి ఘన విజయం సాధించింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఎన్నికలకు వెళితే.. తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లింది. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కట్టారు. 2014 జూన్ 2న కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైంది. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా పరిపాలన సాగించింది. 2019లోనూ చేసిన ప్రజలకు అభివృద్ధిని వివరిస్తూ టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. రాజకీయ స్వలాభం కోసం ఏర్పడిన చాలా పార్టీలు చరిత్రలో కలిసిపోయాయి. కానీ, టీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన పార్టీగా చరిత్రకెక్కడమే కాకుండా.. రెండోసారి ఎన్నికల్లో మరింత భారీ మెజార్టీతో అధికారాన్ని నిలబెట్టుకున్నది.