మహబూబ్‌నగర్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు.. ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితుల్లో కనిపిస్తున్నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బండి ఆదివారం నర్వ మండలంలో పాదయాత్ర చేస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. నర్వకు సాగునీరు లేదని, కేసీఆర్ వడ్లు కొంటలేడని, వాల్మీకి బోయల రిజర్వేషన్‌ను పట్టించుకోలేదని, ఆర్డీఎస్కు గంటల్లో పరిష్కారం చూపించానని నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు. బండికి ఉన్న అవగాహనపై స్థానికులు నోట్లో వేలేసుకుంటున్నారు. బండికి పాలమూరుపై ఏమాత్రం అవగాహన లేకపోవడంతో జనం నవ్వుకుంటున్నారు.
ఇదిగో సాగునీరు..
మూడు రిజర్వాయర్లున్నా సాగునీరు రావడం లేదని ఆరోపించాడు. భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా మక్తల్ నియోజకవర్గానికి సాగునీరు వస్తుందనే విషయం కూడా తెలియకుండా బండి మాట్లాడిన తీరుపై స్థానిక రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు, ముఖ్యంగా ఉమ్మడి పాలమూరుకు జరిగిన అన్యాయానికి చరమగీతం పాడేందుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తున్నది. అందులో భాగంగా రెండు దశల్లో భీమా ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని 2,03,000ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. రాష్ట్రంలో కృష్ణానది మక్తల్ తాలుకాలోని తంగిడి వద్దే ప్రవేశిస్తుంది. అయినా సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాంతం ఎండగట్టినా ఏనాడు బీజేపీ నాయకులు ప్రశ్నించలేదు. భీమా ఎత్తిపోతల పథకాన్ని సమైక్య రాష్ట్రంలో చేపట్టినా ఎక్కడికక్కడే పెండింగ్‌లో ఉంచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లను పూర్తిచేసి సాగునీరు అందిస్తున్నారు. భీమా ఎత్తిపోతల పథకం కింద మక్తల్, మాగనూర్, ఆత్మకూర్, నర్వ, చిన్నచింతకుంట, దేవరకద్ర, కొత్తకోట, పెద్దమందడి, వనపర్తి, పెబ్బేరు, పాన్‌గల్, కోడేరు, వీపనగండ్ల, కొల్లాపూర్ మండలాల్లోని రైతులకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టు విజయవంతంగా పనిచేస్తున్నది.
నర్వకు మూడు రిజర్వాయర్ల నుంచి..
నర్వ మండలంలో ఒక్క గ్రామం తప్ప 18గ్రామాలకు సాగునీరు అందుతోంది. భీమా ప్రాజెక్టు కింద సంగంబండ, భూత్పూరు, కోయిల్ సాగర్ రిజర్వాయర్ల నుంచి సాగునీరు అందుతుంది. మండలంలో 44వేల ఎకరాల సాగుభూమి ఉండగా.. 90శాతం భూములకు సాగునీరు అందుతుంది. మిగతా భూములకు సైతం పరోక్ష పద్ధతిలో సాగునీరు అందుతున్నది. బోర్లు, బావులు రీచార్జి అయ్యాయి. ఇంతటి ఘనత వహించిన మండలంలో పాదయాత్ర చేస్తున్న బండి కనీసం అవగాహన లేకుండా అబద్దాలు మాట్లాడటంపై రైతులు మండిపడుతున్నారు. పాలమూరు కష్టాలను బీజేపీ ఏనాడు పట్టించుకోలేదని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని సాక్షాత్తు ప్రధాని మోదీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి మోసం చేశారని రైతులు మండిపడుతున్నారు.
వరి కొనుగోలుపై సోయి మరిచి..
కేసీఆర్ వడ్లు కొంటామని చెప్పి రైతులను మోసం చేసిండని బండి సంజయ్ మాట్లాడిన తీరు తన దిగజారుడుకు నిదర్శనం. రైతుల కష్టాలు చూడలేక సీఎం కేసీఆర్, మంత్రి మండలి ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపినా కేంద్రం వడ్లు కొనేందుకు ససేమిరా అన్నది. అంతకుముందు మంత్రుల బృందం రెండుసార్లు కేంద్రమంత్రి గోయల్‌ను కలిసి వడ్లు కొనాలని విజ్ఞప్తి చేస్తే అవమానించి పంపారు. కేంద్రం వడ్లు కొనదనే విషయం ముందే అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులను వరికి బదులు ఇతర పంటల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తే.. ఇదే బండి సంజయ్ వడ్లు మేం కొంటాం మీరు ధైర్యంగా పంట వేయండని రైతులను రెచ్చగొట్టారు. తీరా పంట చేతికి వచ్చాక చేయిచ్చారు. ఇంత మోసం చేసిన బీజేపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాలమూరుకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడటం చూస్తే ఆ పార్టీ నేతల వక్రబుద్ధి ఏంటో ప్రజలకు తెలిసిపోతోందని స్థానికులు అంటున్నారు.
తికమక బండి..
ఆర్డీఎస్కు ఎనిమిదేండ్లలో కేసీఆర్ సాగునీరు ఇవ్వకుంటే తాను గంటలో ఇచ్చినట్లు బండి ఏదేదో మాట్లాడారు. తెలంగాణ సర్కారు ఏర్పడిన తర్వాతే తుమ్మిళ్ల లిఫ్ట్ ఏర్పాటు చేసి సుంకేసుల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచి నీటిని తరలించి చివరి ఆయకట్టుకు నీరందించడం ద్వారా ఆర్టీఎస్ రైతుల కష్టాలకు కేసీఆర్ చరమగీతం పాడారు. ఇంకా రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి స్థిరీకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో బీజేపీ చేసిందేమిటో పాలమూరువాసులకు అర్థం కావడంలేదు. బండి సంజయ్, కేంద్రంలోని బీజేపీ ఆర్డీఎస్ రైతులకు ఏం చేశారో సమాధానం చెప్పాలని పాలమూరు రైతులు ప్రశ్నిస్తున్నారు.
వాల్మీకి బోయలపై లేని ప్రేమ
వాల్మీకి బోయల సమస్యను కేసీఆర్ పట్టించుకోలేదని నర్వలో బండి ఆరోపించారు. కానీ, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే చెల్లప్ప కమిటీ వేసి వాల్మీకి బోయల సమస్యలపై నివేదిక తెప్పించుకున్నారు. వారి సామాజిక పరిస్థితులను గుర్తించి ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఇంతవరకు కేంద్రం నుంచి స్పందనే లేదు. అలాంటిది బండి సంజయ్ వాల్మీకులతో మాట్లాడుతూ వారి సమస్యలను కేసీఆర్ పట్టించుకోలేదనడంపై వాల్మీకి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వెంటనే ఎస్టీల్లో చేర్చేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సాగునీరు రావడం లేదనడం అబద్ధం
పాదయాత్ర చేస్తూ మా మండలానికి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. మండలంలో ఒక్క గ్రామం తప్ప అన్ని గ్రామాలకు సాగునీరు అందుతున్నది. మాకు 12ఎకరాల పొలం ఉంది. పొలం మొత్తానికి సాగునీరు అందుతున్నది. గతంలో చుక్క నీరు లేక వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండే. ఇప్పుడు పంటలు పండించుకుంటున్నాం. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సాగునీటి రంగం బాగుపడిందని చెప్పేందుకు మా మండలమే ఉదాహారణ. అలాంటిది సాగునీరు రావడం లేదని అబద్ధాలు చెప్పడం చూస్తుంటే వారి పార్టీ తీరు, వ్యవహారం అర్థం అవుతుంది.
– పాండు, రాంపూర్, నర్వ మండలం
నిజాలు తెలుసుకొని మాట్లాడాలి
మాకు మూడెకరాల సాగు భూమి ఉంది. తెలంగాణ ఏర్పడకముందు ప్రాజెక్టుల నుంచి చుక్క నీరు రాకుండె. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవతో మాకు సాగునీరు వస్తున్నది. పంటలు కళకళలాడుతున్నాయి. చుట్టపు చూపుగా వచ్చే వారికి ఇక్కడి పరిస్థితులు తెలియకుండా సాగునీరు రావడం లేదంటే ఎలా..
– అశోక్, కొత్తపల్లి, నర్వ మండలం
సంగంబండ నీటితో పండిస్తున్నా..
నాకు రెండెకరాల భూమి ఉంది. సంగంబండ రిజర్వాయర్ ద్వారా మా మండలానికి సాగునీరు వస్తుంది. కాల్వ నీళ్లతో ఏటా వరి పండిస్తున్నాను. సీఎం కేసీఆర్ దయతో సాగునీటికి ఏమాత్రం ఢోకా లేదు.
సాగునీరు అందడం లేదని పతిపక్షపోళ్లపు మాటలు అబద్దం.
– మాసిరెడ్డి, రైతు, నర్వ