వనపర్తి, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ)/జడ్చర్ల: దశాబ్దాలుగా దోపిడీకి, వివక్షకు గురవుతున్న దళిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న దళితబంధు పథకంతో అభివృద్ధి బాటలు వేస్తున్నది. దళితుల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ప్రతి నియోజకవర్గంలో పారదర్శకంగా అమలవుతున్నది. లక్ష రూపాయలు ఎరుగని మెజార్టీ దళిత కుటుంబాలకు ఎలాంటి పూచీ లేకుండా దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వకుండా నేరుగా రూ.9.90 లక్షలు లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తున్నారు. అదే సొమ్ముతో తమకు ఇష్టమైన వ్యాపారం చేసుకొని ఎదిగేలా అవకాశం ఇస్తున్నారు. ఇచ్చిన డబ్బులను తిరిగి చెల్లించే పనిలేకుండా దేశ చరిత్రలో కనీవినీ రీతిలో అమలుపరుస్తున్నారు. వనపర్తి జిల్లాకు సంబంధించి 199మంది లబ్ధిదారులకు వారు ఎంచుకున్న యూనిట్లను అందజేశారు. మొదటి విడుతలో 80మందికి అందజేశారు. మిగతా వారికి విడుతల వారీగా అందజేశారు. దళితుల జీవితాల్లో పేదరికాన్ని శాశ్వతంగా పారదోలేందుకు తెచ్చిన ఈ పథకం అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. సీఎం కేసీఆర్‌కు, మంత్రి నిరంజన్‌రెడ్డికి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి జేజేలు పలుకుతున్నారు.
వాహనాలకే ప్రాధాన్యత
దళితబంధు పథకం పొందిన వారిలో అధికశాతం లబ్ధిదారులు వాహనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ట్రాక్టర్లు, టాటా ఏస్‌లు, గూడ్స్ వాహనాలు, లారీలు, వరికోత యంత్రాలు, జేసీబీలు, బొలేరో తదితర వాహనాలను ఎంచుకున్నారు. ఇందులో ఎక్కువగా ట్రాక్టర్లను ఎంచుకున్నారు. వ్యవసాయ రంగంలో ఉపాధి పొందవచ్చనే లక్ష్యంతో చాలామంది ట్రాక్టర్లను ఎంచుకున్నారు. 80మంది లబ్ధిదారులకు వాహనాలు అందజేయగా 52మంది లబ్ధిదారులు ట్రాక్టర్లు తీసుకున్నారు. మిగతా వారు లారీలు, టాటా ఏస్‌లు, గూడ్స్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
జడ్చర్ల మండలంలో..
దళితబంధు పథకంలో భాగంగా జడ్చర్ల మండలంలోని ఖానాపూర్, వల్లూర్, ఉదండాపూర్‌కు చెందిన 30మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేతులమీదుగా వాహనాలను పంపిణీ చేశారు. 10మందికి బొలేరో వాహనాలు, ముగ్గురికి కలిపి వరికోతయంత్రం, మరో నలుగురికి జేసీబీ వాహనం, 23మందికి ట్రాక్టర్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులు వాహనాలను తీసుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసొచ్చి సంతోషం వ్యక్తం చేశారు. పేదల కుటుంబాల్లో దళితబంధు వెలుగులు నింపిందని లబ్ధిదారులు, కుటుంబసభ్యులు సంబురపడ్డారు.
సీఎం కేసీఆర్ చల్లంగా ఉండాలే..
పాలమూరు ఎత్తిపోతల పనుల్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. కూరగాయలు ట్రాన్స్‌ఫోర్ట్ చేద్దామని దళితబంధు పథ కం ద్వారా మహీంద్రా బొలేరో వాహనం తీసుకున్నాను. ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి చేతులమీదుగా కుటుంబసభ్యులతో కలిసి వాహనాన్ని తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. నాకు దళితబంధు, మా అన్నకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిండ్రు.. మా కుటుంబా న్ని ఆదుకున్న సీఎం కేసీఆర్ సారు చల్లంగా ఉండాలే.. మేమం తా కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– సూర్యనారాయణ, దళితబంధు లబ్ధిదారుడు, ఖానాపూర్
మా జీవితాల్లో వెలుగులు నింపింది
ఇదివరకు వేర్వేరుగా పనులు చేసుకొని బతికేవాళ్లం.. దళితబంధు పథకం ద్వారా ఒక్కొక్కరికీ రూ.10లక్షల చొప్పున వచ్చాయి. దీంతో నలుగురు అన్నదమ్ములం జేసీబీ, ట్రాక్టర్ తీసుకున్నాం. అందరం కలిసి ఒకేచోట పనిచేసేందుకు అవకాశం వచ్చింది. ఆర్థికంగా బాగుపడేందుకు దళితబంధు రావడం సంతోషంగా ఉంది. దళితబంధు పథకం మా జీవితాల్లో వెలుగులు నింపింది. ఇంతవరకు ఏ పార్టీ, ఏ నాయకుడు మా కోసం ఆలోచించలేదు.. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సారు మమ్మల్ని దళితబంధుతో ఆదుకున్నారు.
– ఆంజనేయులు, శాంతయ్య, లక్ష్మయ్య, శ్రీరాములు, దళితబంధు లబ్ధిదారులు, వల్లూర్
వరికోత యంత్రం తీసుకున్నాం
మేము చిన్నప్పటి నుంచి మిత్రులం. ఇంతకుముందు మేస్త్రీ, వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవితం గడిపేవాళ్లం. సీఎం కేసీఆర్ అందిస్తున్న దళితబంధు పథకం ద్వారా ముగ్గురం కలిసి వరికోత యంత్రాన్ని తీసుకున్నాం. మార్కెట్లో వరికోత మిషన్‌కు డిమాండ్ ఉండటంతో దళితబంధు పథకం ద్వారా వరికోత యంత్రాన్ని తీసుకున్నాం. దళితులు ఆర్థికంగా బాగుపడాలని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం మాలాంటి పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి రుణపడి ఉంటాం.
– బాలరాజు, శ్రీను, చెన్నయ్య, దళితబంధు లబ్ధిదారులు ఉదండాపూర్
సీఎం కేసీఆర్ సారు.. ఆత్మబంధువు
జూరాల ప్రాజెక్టు ముంపు నిర్వాసితులమైన మాకు ఉమ్మడి రాష్ట్రంలో పరిహారం వచ్చినా అప్పట్లో పైరావీకారులకే అందజేశారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ దళితులను ధనార్జులను చేసేందుకు దళితబంధు ద్వారా రూ.10లక్షలు అందజేసి ఆత్మబంధువుగా మారారు. దళితబంధు పథకానికి కిష్ణంపల్లి గ్రామాన్ని ఎంపిక చేసి ట్రాక్టర్లను అందజేశారు. అందులో నాకు కూడా ట్రాక్టర్ తీసుకున్నారు. సీఎం కేసీఆర్ సారు రుణం ఎప్పటికీ తీరలేనిది.. ఆయనను రుణపడి ఉంటాం.
– పసుల రంగమ్మ, దళితబంధు లబ్ధిదారురాలు, కిష్ణంపల్లి, అమరచింత మండలం