అచ్చంపేటటౌన్, ఏప్రిల్ 24: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం ఆయన నాగర్‌కర్నూల్ ఎంపీ రాములుతో కలిసి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మాట్లాడారు. అంతకుముందు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు, పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ బాండ్లను అందజేశారు. ప్రభుత్వ విప్ గువ్వల మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు.
అదేవిధంగా ఎంపీ రాములు మాట్లాడుతూ ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేసే పథకాలు అన్నివర్గాల వారికి పార్టీలకతీతంగా లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక రాష్ట్రంలో మత విద్వేషాలతో రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్తారని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులను పక్కనపెట్టి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహాగౌడ్, జెడ్పీటీసీ మంత్రియా నాయక్, సీఎంరెడ్డి, తాసిల్దార్ కృష్ణయ్య, గోపాల్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరికలు
ఉప్పునుంతల, ఏప్రిల్ 24: మండలంలోని మామిళ్లపల్లికి చెందిన 20మంది యువకులు ఆదివారం సాయం త్రం అచ్చంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విప్ గువ్వల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షతులమై పార్టీలో చేరినట్లు తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు నాయకత్వంలో పనిచేయాలని పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీలో చేరినవారికి విప్ గువ్వల కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్రావు, ఎంపీటీసీ రాంలక్ష్మమ్మ, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.