మహబూబ్‌నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 17 : మహబూబ్‌నగర్ పట్టణం నడిబొడ్డులో ఉన్న ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఆవరణలో ఉన్న ఆ చెట్ల వయసు సుమారు 150 నుంచి 200 ఏడ్లు. ఈ భారీ వృక్షాలు నిజాం కాలంలో నాటినవి. అయితే పట్టణం విస్తరణలో భాగంగా ప్రజల అవసరార్థం అక్కడ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మిస్తున్నారు. అందులో భాగంగా ఆ భారీ వృక్షాలను కూడా తొలగించాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆ భారీ వృక్షాలను ఎలాగైనా రక్షించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ అధికారులు రీ-ట్రాన్స్ లొకేషన్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఆవరణలోని ఐదు చెట్లను వంద టన్నుల క్రేన్ సాయంతో తొలగించారు. అనంతరం కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో వాటిని తిరిగి నాటారు. అందులో మూడు పెద్ద వేపచెట్లు, కొండమల్లె, ఎలగపండ్ల చెట్టు ఒక్కోటీ ఉన్నాయి. చెట్ల తొలగింపు ప్రక్రియను నాలుగు రోజుల ముందు నుంచే ప్రారంభించారు. ముందుగా చుట్టూ 5 ఫీట్ల లోతు తవ్వి మట్టిని తొలగించడంతో పాటు వేర్లు తొలగించిన అనంతరం పెద్ద కొమ్మలను తొలగించారు. బోడగా అయిన చెట్టును వంద టన్నుల పెద్ద క్రేన్ సాయం తో పెద్ద లారీలో కావాల్సిన చోటుకు తరలించి నాటేలా ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నుంచి సుమారు 10 కి.మీ. దూరంలో ఉన్న కేసీఆర్ అర్బన్ ఎకో పార్కుకు తరలించి అక్కడ వాటికి పునర్జన్మనిచ్చారు. నాటిన అనంతరం 15 నుంచి 45 రోజుల మధ్య మళ్లీ ఈ చెట్లు చిగురిస్తాయని మున్సిపల్ సిబ్బంది తెలిపారు. నలుగురు నిపుణుల పర్యవేక్షణలో మొత్తం పది మంది కూలీలతో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్‌కుమార్, వాటా ఫౌండేషన్ సహకారంతో 5 వృక్షాలను రీట్రాన్స్లొకేషన్ చేపట్టారు. ఈ వృక్షాలను జిల్లా కేంద్రంలోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్కుకు తరలించి అక్కడ నాటినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ట్రాన్స్‌లొకేషన్ చేసిన చెట్లను ఆదివారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు నేతృత్వంలో విజయవంతంగా పెద్ద పెద్ద వృక్షాలను రీ ట్రాన్స్‌లొకేషన్ చేసి కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో నాటించడంలో కృషి చేసిన ప్రజారోగ్య ఈఈ విజయభాస్కర్, ఇతర ఇంజినీరింగ్ అధికారులను మంత్రి అభినందించారు. తిరిగి పునర్జన్మ లభించిన భారీ వృక్షాలకు మంత్రి నీటిన పోశారు. క్రమం తప్పకుండా నీటిని అందించి ఈ వృక్షాలు తిరిగి ప్రాణం పోసుకునేలా చేయాలని సిబ్బందిని ఆదేశించారు.